Telangana HYDRA : హైడ్రా.. తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. చెరువులు, కుంటల ఆక్రమణదారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఏళ్లుగా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తోంది. విశ్వనగరం హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ సిటీలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దంటే.. ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా ఏర్పాటు చేశారు. ఏళ్లుగా ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలను చెరవ విడిపిస్తున్నారు. హైడ్రా ఏర్పాటైన నెల రోజుల్లోనే వందకుపైగా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. 43 ఎకరాలకుపైగా ఆక్రమిత స్థలాను విడిపించింది. హైడ్రా దూకుడుతో కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకుని, బ్యాంకు నుంచి రుణాలు తెచ్చుకుని ఇళ్లు కట్టుకున్నవారు, కొన్నవారు అయితే గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తమకు పట్టా ఉందని, జీహెచ్‌ఎంసీ పరిమిషన్ ఉందని అయినా కూలుస్తున్నారని బోరున విలపిస్తున్నారు. ఈ తరుణంలో నెగిటివీటి నుంచి కూడా ఓ పాటిటివిటీని వెతుక్కున్నాడు ఓ కంటెయినర్ తయారీ సంస్థ యజమాని. ఈమేరకు ఓ ప్రకటన తయారు చేసి సర్క్యులేట్ చేస్తున్నాడు. ఇది చూసి నెటిజన్లు ఏం టైమింగ్‌రా నీది అంటూ కామెంట్ చేస్తున్నారు.
ప్రకటనలో ఏముందంటే..
తాజాగా సోషల్ మీడియాలో సాయితేజ కంటెయినర్స్ యజమాని ప్రకటన వైరల్ అవుతోంది. ‘మీకు హైడ్రా భయం ఉందా.. ఇల్లు కూలుస్తారని ఆందోళన చెందుతున్నారా.. ఇక ఆందోళన అవసరం లేదు. ఎఫ్‌టీఎల్ అయినా.. బఫర్ పరిధి అయినా.. మా కంటెయినర్ పెంట్టుకోండి.. కూలిస్తే మరో చోటకు తరలించుకోండి’ అనే విధంగా యాడ్ ఇచ్చాడు. ఇది చూసి నెటిజన్లు ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్ చేస్తున్నారు.
నెటిజన్ల కామెంట్లు..
సోషల్ మీడియాలో సాయితేజ కంటెయినర్స్ ప్రకటన చూసిన నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. నువ్వు సూపర్ చిచ్చా.. అని కొందరు.. ఇది కదా టైమింగ్ అని కొందరు.. ఎవడ్రా నీవు అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. హైడ్రానే సవాల్ చేసేలా ప్రకటన ఇచ్చిన సాయితేజ కంటెయినర్ యజమానిని అభినందిస్తున్నారు. కొందరేమో ప్రకటన కబ్జాను ప్రోత్సమించేలా ఉందని, చర్య తీసుకోవాలని కోరుతున్నారు. కొందరమే ఈ ప్రకటన చూసి నవ్వుకుంటున్నారు. ఎవడి యాపారం వారిది అంటున్నారు.