Heat Stroke: తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. మార్చి నుంచే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఇక ఏప్రిల్ ప్రారంభం కావడంతో సూర్యుడు మరింత సుర్రుమంటున్నాడు. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. మంగళవారం నిర్మల్, ఖమ్మం, భద్రాది జిల్లాల్లో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు 43.3 డిగ్రీల వరకు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ మరింత అలర్ట్ చేసింది.
మరో 2 డిగ్రీలు పెరిచే ఛాన్స్..
వాతావరణ శాఖ.. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుతాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఇప్పటికే పెరిగిన ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరింత అలర్ట్ చేసింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతోపాటు వడగాలులు వీస్తాయని తెలిపింది.
ఉదయం 9 నుంచి సుర్రు..
ఎండలు పెరుగుతుండడంతో వేడి ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఉదయంం 9 గంటల నుంచే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతోసామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది బయటకు రావడానికి జంకుతున్నారు. ఇదివరకు ఎప్పుడూ ఇంత ఎండలు చూడలేదని పేర్కొంటున్నారు. ఏప్రిల్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటి సారని వాతావరణ శాఖ పేర్కొంటోంది.
ఏపీలోను మండుతున్న ఎండలు..
ఇక ఏపీలోనూ ఎండలు మండుతున్నాయి. నంద్యాల జిల్లాలో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. శ్రీకాకులం, కడప, విజయనగరం, మన్యం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కేంద్రం హెచ్చరించింది.
అత్యవసరమైతేనే బయటకు..
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది. కూలీలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎండలో పని చేయొద్దని తెలిపింది. వృద్ధులు, చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని తెలిపింది. నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలని పేర్కొంది. లేదంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని హెచ్చరించింది.