Telangana hydra: తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఒకప్పుడు చెరువులు, కుంటలతో విలసిల్లేది. ఎప్పుడైతే అభివృద్ధి చేస్తామని పాలకులు కంకణం కట్టుకున్నారో.. అప్పటి నుంచి హైదరాబాద్ తన రూపును కోల్పోవడం ప్రారంభమైంది. చెరువులు నాశనమయ్యాయి. కుంటలు కాలగర్భంలో కలిసిపోయాయి. నాలాలు నామరూపాలను కోల్పోయాయి. ఫలితంగా వర్షం కురిస్తే చాలు హైదరాబాద్ నగరం నీట మునిగిపోతోంది. ఒకప్పుడు చెరువులతో అద్భుతమైన ప్రాంతంగా ఉన్న హైదరాబాద్.. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు చిగురుటాకులా వణికి పోతోంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత.. చెరువులను చెరబట్టి ఆక్రమించిన నిర్మాణాలను పడగొట్టేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ చివరి నిమిషంలో విరమించుకుంది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ కోసం, ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను నియమించింది.. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా హైదరాబాద్ నగరంలో చెరువుల్లోని ఆక్రమణలను క్రమంగా తొలగిస్తోంది.. చెరువులను చెరబట్టారని తెలిస్తే చాలు కూల్చి పడేస్తోంది. ఇందులో పార్టీలతో సంబంధం లేకుండా హైడ్రా దూసుకు వెళ్తోంది. మొదట్లో దీనికి ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నాయకులు రాజకీయరంగు పులిమేందుకు ప్రయత్నించారు. ఈ ఆరోపణలను తిప్పికొడుతూ హైడ్రా కాంగ్రెస్ నాయకుడు పల్లంరాజు సోదరుడి నిర్మాణాలను మొదట కూల్చేసింది.. స్వపక్షమైనా, విపక్షమైనా.. నీటి వనరులను ఆక్రమిస్తే పడగొడతామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హైడ్రా నిజం చేసి చూపించింది.
దానిని ఆదర్శంగా తీసుకొని..
ఢిల్లీలోని ఎమరాల్డ్ ప్రాంతంలో ట్విన్ టవర్స్ నిర్మించారు. ఇది అక్రమం అని తేలడంతో 2012లో ఆ ప్రాంతవాసులు కోర్టును ఆశ్రయించారు. ఆ నిర్మాణాలు అక్రమమని 2014లో అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. అయితే వీటిని కూల్చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో వీటిని నిర్మించిన సూపర్ టెక్ అనే కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ట్విన్ టవర్స్ ఢిల్లీలోని కుతుబ్ మినార్, ఇండియా గేట్ కంటే ఏడు మీటర్ల ఎత్తులో ఉండడంతో కూల్చేశారు. కేవలం ఏడు మీటర్ల ఎత్తులో ఉన్న భవనాలను కూల్చివేసినప్పుడు.. చెరువులను కబ్జా చేసి.. నిర్మించిన భవనాల విషయంలో ఎందుకు ఉదాసీన వైఖరి ప్రదర్శించాలని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే అక్రమం అని తేలితే కూల్చి పడేస్తోంది.
ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది
రాష్ట్రంలో హైడ్రా చేస్తున్న ఆపరేషన్లకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. సినీ హీరో నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పడగొట్టినప్పుడు ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. అయితే దీనిని ఒక్క భారత రాష్ట్ర సమితి మాత్రమే వ్యతిరేకించింది. ఈ కూల్చివేతలకు వ్యతిరేకంగా పోరాడతానని నాగార్జున ప్రకటించినప్పటికీ.. ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. మరోవైపు హైడ్రా నిర్వహిస్తున్న పనులకు ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. హైడ్రా పని తీరుకు హ్యాట్సాఫ్ చెబుతూ గండిపేట వెల్ఫేర్ సొసైటీ సపోర్ట్ వాక్ కూడా నిర్వహించింది. సపోర్ట్ వాక్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటివరకు హైడ్రా ఏం చేసిందంటే..
హైడ్రా ఇప్పటివరకు 18 ప్రాంతాలలో చెరువుల పరిధిలో 43 ఎకరాల పరిధిలో స్ట్రక్చర్స్ ను నేలమట్టం చేసింది. గండిపేట చెరువు పరిధిలోనే 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న నిర్మాణాలను తొలగించింది. కావేరి సీడ్స్ యజమాని భాస్కరరావు, మంథని బీజేపీ నాయకుడు సునీల్ రెడ్డి, బహుదూర్ పూర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్జా, నందగిరి హిల్స్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరుడు, చింతల్ చెరువు లో భారత రాష్ట్ర సమితి నేత రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లం రాజు సోదరుడికి చెందిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అంతేకాదు సీఎం సొంత సోదరుడు తిరుపతిరెడ్డి కూడా హైడ్రా నోటీసులు అందుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆ నిర్మాణాలు పడగొడతారా?
హిమాయత్ సాగర్ లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఫామ్ హౌస్ లు ఉన్నాయి.. వీటిని కూల్చే దమ్ము హైడ్రా కు ఉందా? అని భారత రాష్ట్ర సమితి నాయకులు సవాల్ చేస్తున్నారు. ఒకవేళ వీటిని పడగొడితే.. తెర వెనుక లోపాయి కారీ ఒప్పందం కుదిరి ఉంటుందనే ఆరోపణలు లేకపోలేదు. సీపీఐ నారాయణ అన్నట్టు పులి మీద స్వారీ చేస్తున్న రేవంత్ రెడ్డి.. మరి హైడ్రాను ఏ దిశగా పరుగులు తీయిస్తారనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The hydra is working in a political sense
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com