High Court: జస్ట్‌ నాలుగు వారాలే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాకిచ్చిన హైక్టోర్టు

పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై హైకోర్టు తీర్పునిచ్చింది. స్పీకర్‌ కార్యాలయానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతామని స్పష్టం చేసింది.

Written By: Raj Shekar, Updated On : September 9, 2024 1:36 pm
Follow us on

High Court: పది నెలల క్రితం జరిగిన తెలంగాణ సెంబ్లీన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ఎస్‌ కేవలం 39 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్‌కు 64 సీట్లు వచ్చాయి. దీంతో రేవంత్‌రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పదినెలల పాలనలో ప్రత్యేకత చాటుకుంటున్నారు రేవంత్‌రెడ్డి. సమష్టిగా హామీలను అమలు చేస్తున్నారు. అయితే.. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడారు. ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లాం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీని వీడారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో హై కోర్టును కూడా ఆశ్రయించారు. గతనెలలో పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. సోమవారం(సెప్టెంబర్‌ 9న) తీర్పు వెల్లడించింది. ఇందులో పాఈర్ట మారిన ఎమ్మెల్యేలకు షాక్‌ ఇచ్చే తీర్పునిచ్చింది.

నాలుగు వారాల గడువు..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్‌ పెరిగిపోయింది. అసెంబ్లీ స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? హైకోర్టు ఎలా రియాక్ట్‌ అవుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

మూడు పిటిషన్లు
ఇదిలాఉంటే.. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, కేపీ.వివేకానందగౌడ్‌ తోపాటు.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతోపాటు పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను కోర్టు దృష్టి తీసుకెళ్లారు. పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. పలు దఫాలుగా వాదనలు విన్నది. సోమవారం తీర్పు వెల్లడించింది.

స్పీకర్‌ నిర్ణయంపై ఉత్కంఠ..
ఇదిలా ఉంటే.. నాలుగు వారాల్లో స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న టెన్షన్‌ ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో నెలకొంది. గడువు తక్కువగా ఉన్నందున సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కూడా ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. గతంలో స్పీకర్‌ నిర్ణయాల్లో జోక్యం చేసుకోని కోర్టు.. తాజాగా గడువు ఇవ్వడంపై నేతలు స్పందిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయమన్నారు. కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు కూడా కోర్టు ఇలా స్పందించి ఉంటే బాగుండేది అన్నారు. కేసీఆర్‌పై నమ్మకం లేకనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని తెలిపారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే..

దానం నాగేందర్‌ – ఖైరతాబాద్‌

ప్రకాష్‌ గౌడ్‌ – రాజేంద్రనగర్‌

గూడెం మహిపాల్‌ రెడ్డి – పటాన్‌ చెరు

కాలె యాదయ్య – చేవెళ్ల

అరికెపూడి గాంధీ – శేరిలింగంపల్లి

బండ్ల కష్ణమోహన్‌ రెడ్డి – గద్వాల్‌

ఎం సంజయ్‌ కుమార్‌ – జగిత్యాల

పోచారం శ్రీనివాస్‌ రెడ్డి – బాన్సువాడ

తెల్లం వెంకట్రావు – భద్రాచలం

కడియం శ్రీహరి – స్టేషన్‌ ఘన్‌పూర్‌