Ponguleti Srinivasa Reddy: భారత రాష్ట్ర సమితిని కాదనుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై సర్కారు దృష్టి సారించింది. “ఖమ్మం జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన అభ్యర్థులను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను” అని పొంగులేటి ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయన ఆర్థిక మూలాలపై ప్రత్యేకంగా నజర్ పెట్టింది. ఖమ్మంలో పొంగులేటి, ఆయన సోదరుడు ప్రసాద రెడ్డికి చెందిన ఎస్ ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ పై నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించడం కలకలం రేపుతోంది. పోలీసు బందోబస్తు మధ్య ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సర్వే పూర్తి చేశారు. ఇటీవల ఈ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించే జాయింట్ సర్వేకు హాజరుకావాలని శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఎన్ఎస్పి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, తాను వైరల్ జ్వరంతో బాధపడుతూ హైదరాబాదులో ఉన్నానని, సర్వేకు కొంత సమయం కావాలని ప్రసాద రెడ్డి కోరారు. ఆలోగా ఎన్ఎస్పి అధికారుల వద్ద ఉన్న పత్రాలు తనకు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రసాదరెడ్డి లేకుండానే..
ప్రసాద రెడ్డి విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయన లేకుండానే ఎన్ఎస్పి, రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారుల బృందం సర్వే నిర్వహించింది. ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ గోడకు మార్కింగ్ వేసింది. అయితే ఈ ఫంక్షన్ హాల్ నిర్మించిన స్థలంలో 21 గుంటలు ఎన్ఎస్పి కి చెందిందని అధికారులు నిర్ధారించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి దీనిని ఆక్రమించారని ప్రకటించింది. దీనికి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఉత్కంఠ
అధికారులు సర్వే చేస్తున్నారనే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కడ కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.. ఫంక్షన్ హాల్ నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గుర్తుకురాని సర్వే.. ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు చేస్తోందని వారు ప్రశ్నించారు. ఉమ్మడి సర్వే పేరుతో ఎన్ఎస్పి భూమి ఉందని మార్కింగ్ చేయడం ఎంతవరకు సరైనదని వారు అధికారులను నిలదీశారు. పార్టీ మారిపోయినందు వల్లే శ్రీనివాసరెడ్డి పై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని వారు ఆరోపించారు. అయితే అధికారులు సాయంత్రం వరకు అక్కడే ఉండడం.. ఫంక్షన్ హాల్ గోడను కూల్చివేసేందుకు సలహాలు చేస్తున్నారని ప్రచారం జరగడంతో కార్యకర్తలు భారీగా మోహరించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు
అయితే ఉమ్మడి సర్వే ప్రక్రియను హైకోర్టు ఆదేశాల మేరకే చేశామని ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ చెబుతున్నారు. పొంగులేటి ప్రసాద రెడ్డి ఎన్వోసి కోసం దరఖాస్తు చేశారని, దీనిపై హైకోర్టులో కూడా పిటిషన్ వేశారని ఆమె గుర్తు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి సర్వేకు రావాలని ఈనెల 15న ఆయనకు నోటీసు జారీ చేశామని ఆమె వివరించారు.. ఈ నోటీస్ పై కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, సోమవారం ఉమ్మడి సర్వేకు రావాలని కోరినప్పటికీ రాకపోవడంతో తామే సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశామని శైలజ వివరించారు. కాగా, శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో ఆయన ఆర్థిక మూలాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితికి సంబంధించిన అభ్యర్థులను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని శ్రీనివాసరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పై ప్రత్యేక నజర్ పెట్టారని ప్రచారం జరుగుతున్నది. ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ కేవలం శాంపిల్ మాత్రమే అని.. వచ్చే రోజుల్లో ఇలాంటివి చాలా జరుగుతాయని భారత రాష్ట్ర సమితి నాయకులు అంతర్గతంగా సంభాషించుకుంటున్నారు. మొత్తానికి ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఉమ్మడి సర్వే వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రసాద రెడ్డి ఇంతవరకూ స్పందించలేదు.