
ABN RK – KCR: ఇవాళ అంబేద్కర్ జయంతి.. తెలంగాణ ముఖ్యమంత్రి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజే ఆవిష్కరించబోతున్నాడు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్. ఈ కార్యక్రమాన్ని సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తోంది. అంతేకాదు పత్రికలకు భారీ ఎత్తున జాకెట్ యాడ్స్ ఇచ్చింది. ఈనాడు నుంచి మొదలు పెడితే వార్త పత్రిక వరకు అన్నింటిలోనూ ఫస్ట్ పేజీ జాకెట్ యాడ్స్ కుమ్మేసింది. కానీ ఆకస్మాత్తుగా ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ జాకెట్ యాడ్ కనిపించలేదు. ఆ స్థానంలో భట్టి విక్రమార్క పాదయాత్రకు సంబంధించిన ఈ యాడ్ ఒకటి కనిపించింది.
ఎక్కడ మొదలైందో తెలియదు గానీ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య వైరం అంతకంతకు పెరుగుతోంది. గతంలో ఇలాంటి వైరం ఇద్దరి మధ్య ఏర్పడినప్పుడు ఎడ మొహం పెడ మొహం గా ఉన్నారు. తర్వాత చండీయాగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాధాకృష్ణ పిలిచారు. తర్వాత ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. తర్వాత ఇద్దరు మళ్ళీ దోస్తులయ్యారు. అదే సమయంలో వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఆఫీస్ కాలిపోతే మరోచోట కెసిఆర్ జాగా ఇచ్చి ఆదుకున్నాడు. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరి మధ్య వైరం మొదలైంది. అది చినికి చినికి మళ్ళీ గాలివాన అయింది. ఇది ఎప్పుడు చల్లారుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఉప్పు నిప్పులాగా వ్యవహారం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కెసిఆర్ ఆంధ్రజ్యోతిని ఆర్థికంగా దెబ్బ కొడుతున్నాడు. ప్రభుత్వ పరంగా వచ్చే ప్రకటనలను ఇవ్వకుండా తొక్కి పెడుతున్నాడు. సర్కులేషన్ ప్రకారం చూస్తే ఆంధ్ర జ్యోతి తెలంగాణలో టాప్ త్రీ లో ఉంటుంది. కానీ ఇవేవీ పట్టించుకోని కేసీఆర్ చివరకు వార్త పత్రికకు కూడా జాకెట్ యాడ్ ఇస్తున్నాడు కానీ.. ఆంధ్రజ్యోతి విషయంలో మాత్రం అదే కక్షను ప్రదర్శిస్తున్నాడు.
ఇక కెసిఆర్ కు తగ్గట్టుగానే రాధాకృష్ణ వ్యవహరిస్తున్నాడు. తనకు వ్యతిరేకమైన వార్తలను పత్రికలో ప్రచురిస్తున్నాడు. భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వెళ్లిన వారితో హాట్ హాట్ ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. ఇవి కెసిఆర్ కు అసలు కోరుకుడు పడటం లేదు. కెసిఆర్ తో యుద్ధానికి సిద్ధమని ఆర్కే సంకేతాలు ఇస్తున్నాడు. అంతేకాదు తన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో కెసిఆర్ ను నేరుగానే విమర్శిస్తున్నాడు. ఆ మధ్య ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు వినిపించినప్పుడు నేరుగా ఆమె నిందితురాలు అంటూ ఆంధ్ర జ్యోతి బ్యానర్ వార్త ప్రచురించింది. అంతే కాదు కవితను ఇంటర్వ్యూ చేస్తూ రాధాకృష్ణ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఇది గులాబీ శిబిరానికి మరింత ఆగ్రహం తెప్పించిందని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతున్నది. మరి శత్రువులైన ఈ మిత్రులు ఎప్పుడు కలుస్తారో కాలమే చెప్పాలి.

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రజ్యోతికి ఇదే పరిస్థితి. అక్కడ జగన్ అంటే రాధాకృష్ణకు అసలు ఇష్టం ఉండదు. ఆ అయిష్టతను తన వార్తల ద్వారా ప్రతిబింబిస్తూనే ఉన్నాడు.. అప్పట్లో రాధాకృష్ణ భార్య కన్నుమూసినప్పుడు జగన్ ఫోన్ చేసి రాధాకృష్ణను పరామర్శించాడు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అది ప్రచారం మాత్రమేనని తెలుసుకొనేందుకు ఎన్నో రోజులు పట్టలేదు. తన రాతలతో ఇబ్బంది పెడుతున్న రాధాకృష్ణకు జగన్ మొదటి నుంచి యాడ్స్ ఇవ్వడమే మానేశాడు. ఆంధ్రజ్యోతి దీనిపై కోర్టుకు కూడా వెళ్లలేదు. మొత్తానికి అటు జగన్, ఇటు చంద్రశేఖర రావు తో రాధాకృష్ణ వైరం కొనసాగిస్తున్నాడు. ఇది ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది.