HomeతెలంగాణBRS: కేసీఆర్ కథ : జాతీయ పార్టీలను తొక్కి.. ఇప్పుడే అదే పార్టీల మధ్య నలిగి

BRS: కేసీఆర్ కథ : జాతీయ పార్టీలను తొక్కి.. ఇప్పుడే అదే పార్టీల మధ్య నలిగి

BRS: తెలంగాణ ఉద్యమం పేరుతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. తెలంగాణ నినాదం పేరుతో కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులతోపాటు తెలంగాణ వ్యతిరేక పార్టీ అయిన టీడీపీని తన దారిలోకి తెచ్చుకున్నారు. తెలంగాణ ఇస్తే చాలు తన పార్టీని జాతీయ పార్టీలో విలీనం చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. దీంతో తెలంగాణ సాధించారు. కానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ తర్వాత తనకు సహకరించిన పార్టీలనే తొక్కేయాలని చూశారు. కాంగ్రెస్, టీడీపీ అనేవి లేకుండా చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. తన రాజకీయ చతురతతో తెలంగాణలో ఏకఛత్రాధిపత్యం సాధించారు.

తెలంగాణ అభివృద్ధి..
ఇక కేసీఆర్‌ పాలనలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించింది. నీళ్లు, నిధులు, విద్యుత్‌ విషయంలో మంచి ప్రగతి సాధించింది. ఇది ఎవరూ కాదనలేని నిజం. కానీ, ఆయన చేసిన తప్పు ఎవరినీ లెక్కచేయకపోవడం. తనే మోనార్క్‌ అన్నట్లుగా వ్యవహరించడం. తనకు తిరుగేలదని, తానే తెలంగాణకు రాజును అన్నట్లుగా పాలన సాగించడం, తన నిర్ణయాలే ఫైనల్‌ అన్నట్లు తీసుకోవడం. ఇక తనను ప్రశ్నించేవాడు ఉండకూడదని కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు.

దశాబ్దం తర్వాత మారిన తీరు..
తెలంగాణ ప్రజలకు అన్నీ చేస్తున్నానని ఇన్నాళ్లూ కేసీఆర్‌ అనుకున్నారు. మరో 20 ఏళ్లు కూడా తానే అధికారంలో ఉంటానని భావించారు. కానీ, పదేళ్ల తర్వాత పరిస్థితి తారుమారైంది. అందరినీ కలుపుకుపోవడంలో విఫలం కావడం, విలువలకు తిలోదకాలు ఇచ్చారు. దీనిని నిశితంగా గమనిస్తూ వచ్చిన తెలంగాణ సమాజం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీని చిత్తుగా ఓడించింది.ఆయన తిట్టిన ఆంధ్రా సెటిలర్లే హైదరాబాద్‌లో కాస్త అండగా నిలిచారు. తెలంగాణ అంతా జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేశారు. ఇక అధికారం కోల్పోవోడంతో నాడు ఆపార్టీలోకి వలస వచ్చిన నేతలంతా ఇప్పుడు అధికార కాంగ్రెస్‌ వైపు వెళ్తున్నారు.

పార్టీని కాపాడుకోగలరా..
ఇక ఇప్పుడు కేసీఆర్‌ పరిస్థితి గమ్యం లేని ప్రయాణంలా మారింది. సీనియర్లు, జూనియర్లు పదవులు వచ్చిన వారు, రాని వారు అనే తేడా లేకుండా అంతా పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్‌లోకి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు నెలకొన్న పరిస్థితి చూస్తుంటే.. పార్లమెంటు ఎన్నికల తర్వాత మరీ దారుణంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు వస్తే కేసీఆర్‌ను దేకేవారు కూడా ఉండరని పేర్కొంటున్నారు. గెలిచిన ఒకరిద్దరు ఎంపీలు కూడా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరిపోతారని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిలో కేసీఆర్‌ పార్టీని ఎలా కాపాడుకుంటారు అనేది సమాధానం లేని ప్రశ్నే.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version