Telangana PCC President: పీసీసీ పదవికి గట్టిపోటీ..? బీసీ నేతకే ఛాన్సెక్కువంటా..!

ఈనెల 27తో రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి 3 ఏళ్లు పూర్తవుతుంది. అందువల్ల జూన్ చివరివారం నాటికి కొత్త పిసిసిని అధిష్టానం ఎంపిక చేయనుంది. ప్రస్తుతానికి టిపిసిసి కోసం పలువురు సీనియర్ నాయకులు తమ శక్తికి మించిన ప్రయత్నాలు చేస్తున్నారు.

Written By: Neelambaram, Updated On : June 7, 2024 6:08 pm

Telangana PCC President

Follow us on

Telangana PCC President: తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఎంపికపై కాంగ్రెస్ హై కమాండ్ కసరత్తును ప్రారంభించింది. ఢిల్లీలో జరగనున్న సిడబ్ల్యూసి సమావేశాల సందర్భంగానే టి-పిసిసి పదవిపై అధిష్టానం ఒక క్లారిటీకి రానుంది. త్వరలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులతో పాటు..తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై అధిష్టానం కసరత్తును పూర్తి చేయాలని భావిస్తోంది. సిడబ్ల్యుసి సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు,టిపిసిసి పదవి ఎంపికపై మాట్లాడేందుకు ఇప్పటికే ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిలుపు వచ్చింది.

ఈనెల 27తో రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి 3 ఏళ్లు పూర్తవుతుంది. అందువల్ల జూన్ చివరివారం నాటికి కొత్త పిసిసిని అధిష్టానం ఎంపిక చేయనుంది. ప్రస్తుతానికి టిపిసిసి కోసం పలువురు సీనియర్ నాయకులు తమ శక్తికి మించిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్ నాయకులు హస్తినాలోనే మకాం వేసి పిసిసి పదవి కోసం లాబీయింగ్ మొదలెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి కొనసాగుతుండగా.. మరో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్, అంజనీ కుమార్ గౌడ్,జగ్గారెడ్డిలు ప్రస్తుతం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు నేతలు తమకు ఈసారి ప్రమోషన్ కల్పించాలని అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న తమకు టిపిసిసి పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు.

ఇక వీరితోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత,ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ గౌడ్ కూడా తనకు పిసిసి పదవి ఇవ్వాలని హై కమాండ్ కు తెలియజేశారు. ఇక వీరితో పాటు మరి కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిసిసి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోటీ ఎలా ఉన్నా..అధిష్టానం మాత్రం టిపిసిసి అధ్యక్ష అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని ఈ విషయంలో ఇప్పటికే హై కమాండ్ తీసుకుంది. రేవంత్ రెడ్డి కూడా ఓ అభ్యర్థి పేరును పిసిసి పదవి కోసం అధిష్టానానికి ప్రపోజ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎవరి నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందున పిసిసి పదవిని మాత్రం ఓ బీసీ నేతకు ఇవ్వాలనే ఆలోచనలో హై కమాండ్ ఉన్నట్లు టాక్.