AP Assembly Election Results 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన వైఎస్సార్‌సీపీ చిత్తుగా ఓడిపోయింది. టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి ఘన విజయం సాధించింది. 2019లో 151 సీట్లు గెలిచిన వైసీపీ ఇప్పుడు కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ఓటమిపై ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
మంచి జరిగితేనే ఓటేయమని..
జగన్ తన ఎన్నికల ప్రచారంలో.. రాష్ట్రంలో మీకు మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తాను ఒంటరిగా వస్తున్నానని, తనకు మీరే అండ అని పేర్కొన్నారు. తనకు స్టార్ క్యాంపెయినర్లు కూడా జనమే అని చెప్పారు. జగన్ సభలకు కూడా భారీగా జనం తరలి వచ్చారు. కానీ, ఎన్నికల ఫలితాలు పూర్తి విరుద్ధంగా వచ్చాయి. జగన్ చెప్పినట్లు ఇప్పుడే ఏపీలో వైసీపీ పాలనలో ఎవరికీ మంచి జరగలేదా అన్న చర్చ మొదలైంది. ఐదేళ్లలో 2.5 కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందాయన్న ధీమాతోనే జగన్ మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటే వేయమని అడిగారు. కానీ, ఆ పార్టీ ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లకు పరిమితమైంది. కూటమి 60 శాతం ఓట్లు సాధించింది.
ఓటమిపై భిన్న వాదనలు..
ఇక వైసీపీ ఓటమిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సంక్షేమం మినహా అభివృద్ధి లేదని కొందరు అంటున్నారు. అరాచకాలు పెరిగాయని మరికొందరు పేర్కొంటున్నారు. రాజధాని తరలింపు కారణం అని ఇంకొందరు పేర్కొంటున్నారు. మూడు రాజధానుల నిర్ణయం బెడిసి కొట్టిందని ఇంకొందరు అంటున్నారు. అయితే మంచి జరగలేదని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. అంటే రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మంచి జరిగింది. కానీ, ఓట్లు మాత్రం పడలేదు. అందుకే ఇన్నాళ్లు నాయకుల చేతిలో మోసపోయిన ప్రజలను చూశాం.. తొలిసారి ప్రజల చేతిలో మోసపోయిన నాయకుడిని చూస్తున్నాం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సమీక్ష చేసుకోవాల్సిందెవరు..
ఇక వైసీపీ ఓటమిపై ఇప్పుడు ఏపీలో ఎవరు సమీక్ష చేసుకోవాలి అన్న చర్చ కూడా జరుగుతోంది. వైసీపీ ఇప్పటికే ఓటమిపై పోస్టుమార్టం మొదలు పెట్టింది. కానీ, వైసీపీ కన్నా.. ప్రజలు కూడా సమీక్ష చేసుకోవాలని కొందరు సూచిస్తున్నారు. కూటమి హామీలు అమలు చేయకపోతే.. అనతికాలంలోనే టీడీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటుందని పేర్కొంటున్నారు.