CM Revanth Reddy : ట్రాన్స్ జెండర్లు.. ఇటు స్త్రీలుగా, అటు పురుషులుగా కాకుండా మూడో రకంగా సమాజంలో జీవనం సాగిస్తున్నారు. వీరిని సమాజం ఇంకా అంగీకరించడం లేదు. హేళన చేస్తోంది. అవకాశాలు కల్పించడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వాలే వారి కోసం చొరవ చూపుతున్నాయి. అందుకే అప్పుడప్పుడు వారు ఆయా రంగాల్లో నిలదొక్కుకుంటున్నారు. డాక్టర్లుగా, రాజకీయ నేతలుగా, ఉద్యోగులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సమాజంలో ట్రాన్స్ జెండర్ల సంఖ్య తక్కువే అయినా.. వారికి పని కల్పించే వారు లేకపోవడంతో చాలా మంది భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉత్సవాలు, వేడుకల్లో పాల్గొంటూ భక్తులను ఆశీర్వదిస్తూ ఆదాయం పొందుతున్నారు. అయితే ఇలాంటి వారికి కూడా ఉపాధి కల్పించాలన్న ఆలోచన చేశారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ట్రాన్స్ జెండర్లు పెరుగుతున్నారు. జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం రాజధానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ట్రాఫిక్ వలంటీర్లుగా నియమించే ఆలోచన చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
జీహెచ్‌ఎంసీ పనులపై సమీక్షలో..
రాజధాని హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ పౌర సేవల కోసం చేపట్టిన పనుల పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్య నియంత్రించేందుకు హోం గార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్లను వలంటీర్లుగా నియమించే అవకాశం పరిశీలించాలని సీఎం సూచించారు. తద్వారా వారికి ఉపాధి కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. దీంతో వారికి ఉపాధి కూడా దొరుకుతుందని పేర్కొన్నారు. నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఇండోర్‌లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు.
మూసీ నిర్వాసితులకు పునరావాసం..
ఇక మూసీ ప్రక్షాళనను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నది ఆక్రమణదారులను తరలించే పనులు త్వరగా చేపట్టాలన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని తెలిపారు. నగరంలో ఐదేళ్ల క్రితం సమగ్ర రహదారుల నిర్వహణ కింద 811 కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. అయితే వాటి నిర్వహణను మాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రోడ్ల నిర్వహణను నిర్లక్ష్యం చేసే ఏజెన్సీలను వదిలిపెట్టొద్దని ఆదేశించారు. పనులు చేయని కాంట్రాక్టర్ల వివరాలతో 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు.
ఆర్థిక ఇబ్బందులు లేకుండా..
జీహెచ్‌ఎంసీలో నిరంతరం జరిగే పనులకు ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రణాళిక రపొందించుకోవాలని సూచించారు. అద్దెలు, ప్రకటనలు, హోర్డింగ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని సమీక్షించుకోవాలని తెలిపారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరిస్తున్నందున అక్కడ రోడ్లు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పరిసరాల్లోని అటవీ, పరిశ్రమల భూములు సేకరించాలని సూచించారు. అక్కడి పరిశ్రమలను మరోచోటుకు తరలించాలని తెలిపారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More