Telangana Municipal Elections: అధికారం ఉన్నప్పుడు ఏదైనా చేయవచ్చు. సాధ్యం కానిది కాళ్ల దగ్గరికి తెచ్చుకోవచ్చు. 2020 పురపాలక ఎన్నికల్లో గులాబీ పార్టీ ఇలానే చేసింది. అధికారాన్ని ఉపయోగించింది. అంగ బలాన్ని ప్రయోగించింది. అర్ధాన్ని వాడింది. తద్వారా తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది.
2020లో జనవరి నెలలో పురపాలక ఎన్నికలు జరిగాయి. నాటి ఎన్నికల్లో 120 మున్సిపాలిటీలు.. 9 కార్పొరేషన్లకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. నాటి ఎన్నికలలో గులాబీ పార్టీ సత్తా చూపించింది. 120 మున్సిపాలిటీలలో ఏకంగా 110 కంటే ఎక్కువ మునిసిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. 9 కి 9 కార్పొరేషన్లను గులాబీమయం చేసింది. మొత్తం 2727 వార్డులలో దాదాపు 70 శాతానికి దగ్గరగా స్థానాలను గులాబీ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 500 వార్డులలో సత్తా చూపిస్తే.. బిజెపి 200 వార్డులలో తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
2020 పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత దయనీయమైన స్థితిలో ఉండేది. చాలా ప్రాంతాలలో రెండవ స్థానంలో నిలిచినప్పటికీ మునిసిపల్ పీఠాలను అందుకోలేకపోయింది. నాడు హుజుర్ నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలో గులాబీ పార్టీ విజయం సాధించిన తర్వాత.. పురపాలక ఎన్నికలు వచ్చాయి. దీంతో గులాబీ పార్టీ సహజంగానే జోష్ మీద పాల్గొంది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన కంచుకోటలను కూడా కాపాడుకోలేకపోయింది. పట్టణ ప్రాంతాలలో బిజెపి సత్తా చూపించినప్పటికీ.. అది కొన్ని ప్రాంతాలలో మాత్రమే ప్రభావం చూపించింది. 2020 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు సత్తా చూపించడం విశేషం.
నాటి ఎన్నికల్లో గులాబీ పార్టీ కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చింది. దానిని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. అయినప్పటికీ అధికారాన్ని ఉపయోగించి గులాబీ పార్టీ ఇష్టానుసారంగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. వాటి ద్వారానే ఎన్నికలు జరిపింది. ఇక ఓటర్ల జాబితా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇలా అన్ని రకాలుగా అధికార దర్పాన్ని ప్రయోగించి గులాబీ పార్టీ నాటి ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు సాధించింది. ఇక ఇప్పుడు గులాబీ పార్టీ పరిస్థితి మరో విధంగా ఉంది. అధికార పార్టీగా కాంగ్రెస్ కొనసాగుతోంది. అప్పటి పురపాలక ఎన్నికల్లో కేటీఆర్, హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు వారిద్దరూ కనిపించడం లేదు. అందువల్లే గులాబీ పార్టీ ఆత్మ రక్షణ ధోరణిలో పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
