KCR: భారత రాష్ట్ర సమితిలో కేటీఆర్ కంటే ముందు నంబర్ టు గా కొనసాగిన ఈటెల రాజేందర్ ఎందుకు బయటకు వెళ్లారు? కెసిఆర్ ఆయనను ఎందుకు బయటకి సాగనంపారు? గులాబీ జెండాకు ఓనర్లం మేమే అని అన్నందుకేనా? ఆయనను బయటకు వెళ్ళగొట్టింది? అని ఇప్పటిదాకా అందరూ అనుకున్నారు. కానీ ఈ విషయం మీద అటు కేసీఆర్ గాని ఇటు ఈటెల రాజేందర్ గాని బయటపడలేదు. బయటకు చెప్పలేదు. పైగా ఇప్పుడు పరస్పరం శత్రువుల లాగా గజ్వేల్ నియోజకవర్గం లో పోటీపడుతున్నారు. ఎవరికివారు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.. కానీ తొలిసారి ఈటెల బహిష్కరణ వెనుక అసలు నిజాన్ని కేసీఆర్ వెల్లడించారు.
అందుకే పంపించారా?
తెలంగాణలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. అధికార భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ మధ్య టగ్ ఆఫ్ వార్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీడియా కూడా దీనినే ఊదరగొడుతోంది. కొన్ని కొన్ని సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ మాత్రం సైలెంట్ గా తన పని చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో ఎలాగైనా మూడవసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న కేసీఆర్.. కాలికి బలపం కట్టుకొని తెలంగాణ మొత్తం పర్యటిస్తున్నారు. ఒకేరోజు మూడు నియోజకవర్గాలలో ప్రజా ఆశీర్వాద సభల పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. ఇక శుక్రవారం ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ పేరు ఎత్తకుండానే విమర్శలు చేశారు. ” పాడి కౌశిక్ రెడ్డి కొత్తగా భారత రాష్ట్ర సమితి పార్టీలోకి రాలేదు. గతంలో వాళ్ళ నాయన గులాబీ పార్టీ జెండా మోసాడు. గత ఏడాది మీరు నన్ను మోసం చేశారు. ఈసారి అలా జరగకూడదు.” అంటూ కేసిఆర్ అసలు విషయం చెప్పేశారు.. ఇదే సమయంలో ఈటల రాజేందర్ ను ఎందుకు బర్తరఫ్ చేశామో కెసిఆర్ చెప్పకనే చెప్పేశారు.
క్లారిటీ వచ్చింది
ఈటెల రాజేందర్ ను బయటికి పంపాలని కేసీఆర్ ఎప్పటినుంచో అనుకున్నారని, తాజాగా ఆయన వ్యాఖ్యల ద్వారా వెళ్లడైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీలో రెండవ స్థానంలో ఉన్న ఈటెల రాజేందర్ కు పొమ్మన లేక పొగ పెట్టారని వారు విమర్శిస్తున్నారు. పార్టీ కోసం ఎంతో పని చేసినా.. తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని కెసిఆర్ విమర్శించడం ఇందుకు బలం చేకూర్చుతోందని వారు ఉదహరిస్తున్నారు. అంతేకాదు పాడి కౌశిక్ రెడ్డికి 2018లో భారత రాష్ట్ర సమితి కీలక నాయకులు తెర వెనుక సహాయం చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈటెల రాజేందర్ గెలుపొందారనే వాదనలున్నాయి. అయితే అప్పటినుంచే భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం మీద ఆగ్రహంతో ఉన్న ఈటెల రాజేందర్.. సమయం దొరికినప్పుడల్లా గులాబీ అధిష్టానం మీద విమర్శలు చేసేవారు. ఇక ఇది సాగించలేని స్థితికి రావడంతో కెసిఆర్ రాజేందర్ పై వేటు వేశారు. ఆ తర్వాత రాజేందర్ బిజెపిలో చేరడం.. హుజరాబాద్ ఎన్నికల్లో గెలుపొందడం.. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అవడం.. ప్రస్తుతం నియోజకవర్గంలో హోరా హోరీగా పోరు సాగుతుండడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించిన ఈ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గెలుస్తారా? పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధిస్తారని వచ్చే నెల మూడవ తేదీన తేలనుంది.