TGSRTC: సంక్రాతి పండుగ సెలవులు శనివారం(జనవరి 11) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్నవారు సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఆంధ్రా వెళ్లే వారు ఇప్పటికే రైళ్లలో టికెట్ బుక్ చేసుకున్నారు. ఇక తెలంగాణ నుంచి ఆంధ్రాతోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసి(RTC) నిర్ణయించింది. జనవరి 10, 11, 12 తేదీలో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా బస్సులు నడిపించాలని నిర్ణయించింది. ఈమేరకు 6,432 బస్సులు సిద్ధం చేసింది. ఇక సెలవుల(Hollydays) తర్వాత జనవరి 18, 19, 20 తేదీల్లో మళ్లీ రద్దీ పెరుగుతుందని ఆర్టీసీ అంచనా వేసింది. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతామని తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ప్రత్యేక బాదుడు..
సంక్రాంతి నేపథ్యంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల నుంచి 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమలవుతోంది. సాధారణ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం అమలు అవుతుందని తెలిపారు. అయితే ప్రత్యేక బస్సుల్లో మాత్రం ఉచితం వర్తించదని, చార్జీతోపాటు 50 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రయాణికులతో వెళ్లిన బస్సులు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తాయని, దీంతో డీజిల్(Desile) భారం సంస్థ పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అందుకే అదనపు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈమేరకు జీవో 16ను ప్రభుత్వం జారీ చేసింది. జనవరి 10, 11, 12, 18, 19, 20 తేదీల్లో అదనపు బస్‌చార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ అధికారి తెలిపారు.
ఫ్రీ బస్ సర్వీస్ కొనసాగింపు..
సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి(Mahalaxmi) పథకం కింద ఉచిత రవాణా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రత్యేక సర్వీసుల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్లను 040–69440000, 040–23450033 నంబర్లను సంప్రదించాలని సూచించారు. రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్, కేపీహెచ్‌బీ, బోయినపల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసి తెలిపింది. ప్రయాణికుల కోసం షామియానాలు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేశామని తెలిపింది. కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం మొబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
6,432 ప్రత్యేక బస్సులు..
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ ఈసారి ఎక్కువ బస్సులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈమేరకు 6,432 బస్సులను సిద్ధం చేసింది. 557 సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్(Resarvation) అమలులోకి తెచ్చింది. జనవరి 9 నుంచి 15 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఈ ప్రత్యేక బస్సులు నడుపుతారు. అమలాపురం, కారినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమహేంద్రవరం, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి నగరాలకు ఈ బస్సులు నడుస్తాయి. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్ల కోసం అధికారిక వెబ్ సైట్ www.tgsrtcbus.in ను సందర్శించవచ్చు.