TGSRTC Conductor Recruitment 2026: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో అయోమయం నెలకొంది. అదేంటంటే?
టీఎస్‌ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియలో ప్రస్తుతం గ్రేడింగ్ విధానం, మార్కుల శాతం అంశం కీలకంగా మారింది. గతంలో కండక్టర్ పోస్టుల ఎంపిక పూర్తిగా పదో తరగతిలో సాధించిన మార్కుల శాతం ఆధారంగానే జరిగేది. అభ్యర్థుల మెరిట్‌ను నిర్ణయించి, రీజియన్ వారీగా ఖాళీలు, రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి నియామకాలు చేపట్టేవారు. అయితే కొన్ని సంవత్సరాల పాటు తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు మార్కుల స్థానంలో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ఆ సంవత్సరాల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు మార్కుల బదులుగా గ్రేడ్ పాయింట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇటీవల మళ్లీ మార్కుల విధానాన్ని పునరుద్ధరించడంతో ప్రస్తుతం ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల్లో ఒక వర్గం మార్కుల శాతంతో, మరో వర్గం గ్రేడ్ పాయింట్లతో ఉండే పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు విధానాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఒకే మెరిట్ జాబితాలో ఎలా పరిగణనలోకి తీసుకోవాలన్నది ఆర్టీసీకి ప్రధాన సవాల్‌గా మారింది. మార్కులు పొందిన అభ్యర్థులతో గ్రేడింగ్ విధానంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను నేరుగా పోల్చడం సాధ్యం కాకపోవడంతో, అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధానంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇదిలా గ్రేడ్ పాయింట్లను మార్కుల శాతంగా ఎలా మార్చాలనే విషయంపై స్పష్టత కోరుతూ తెలంగాణ ఆర్టీసీ ఎస్సెస్సీ బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం. గ్రేడింగ్ విధానంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మార్కుల సమానత ఎలా నిర్ణయించాలనే అంశంపై బోర్డు నుంచి మార్గదర్శకాలు వచ్చే అవకాశముంది.గ్రేడింగ్‌ను మార్కుల శాతంగా మార్చే విధానం ఖరారైన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని అభ్యర్థులను ఒకే ప్రమాణంతో పోల్చి మెరిట్ జాబితా రూపొందించనున్నారు. ఎవరూ నష్టపోకుండా, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ సాగేందుకు అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎస్సెస్సీ బోర్డు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవుతోంది. నోటిఫికేషన్‌లో అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని వేలాది మంది నిరుద్యోగ యువత ఈ నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
