TG Vehicle Registration: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొత్త కోడ్‌ను ప్రభుత్వం శుక్రవారం నుంచి అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం ఉన్న టీఎస్ (TS) స్థానంలో కొత్తగా టీజీ(TG) అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో శుక్రవారం నుంచి అమలు చేస్తున్నారు. కొత్త కోడ్ ప్రారంభమైన తొలి రోజే రవాణా శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. గ్రేట్ హైదరాబాద్ పరిధిలో రవాణా శాఖకు కాసులు కురిశాయి.
ఫ్యాన్సీ నంబర్ల కోసం..
టీజీ కోడ్ ప్రారంభమైన తొలిరోజే గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో రవాణా శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. ఫీజు, ఫ్యాన్సీ నంబర్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాకకు రూ.2.51 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో రూ.1.32 కోట్లు మూడు జిల్లాల నుంచే రావడం విశేషం. అన్ని కార్యాలయాల్లో టీజీ కోడ్‌తో 0001 సిరీస్ ప్రారంభమైంది. దీంతో వాహనదారులు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎగబడ్డారు. ఆన్‌లైన్‌లో పోటా పోటీగా బిడ్డింగ్ చేశారు. ఖైరతాబాద్ ఆర్టీ పరిధిలో టీజీ09 0001 నంబరు ఏకంగా 9,61,111 పలికింది. రాజీవ్‌కుమార్ ఆన్‌లైన్‌లో ఈ నంబర్‌ను దక్కించుకున్నాడు.
వివిధ నంబర్లకు..
ఖైరతాబాద్‌తోపాటు టోలిచౌకి, మలక్‌పేట, బండ్లగూడ, తిరుమలగిరి, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, కూకట్‌పల్లి, మేడ్చల్ రవాణా కార్యాలయాల్లో కొత్త కోడ్‌లో అధికారులు రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ఫ్యాన్నీ సిరీస్ నంబర్ల కోసం అధికారులు ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ నిర్వహించగా 0009, 0999 లాంటి నంబర్లకు డిమాండ్ ఏర్పడింది. వాహనదారులు వేలంలో పోటీపడి నంబర్లు దక్కించుకున్నారు.
మరో 15 రోజులు పాత స్లాట్లే..
ఇదిలా ఉండగా ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులకు మాత్రం పాత కోడ్ టీఎస్‌తోనే రిజిస్ట్రేషన్లు చేశారు. మరో 15 రోజుల వరకు పాత స్లాట్లతోనే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారికి మాత్రమే టీజీ కోడ్ సిరీస్ కేటాయిస్తున్నారు.