CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుడైపోయారు. ఏకంగా గుడిలో కొలువు తీరబోతున్నారు. ఈనెల 19న రేవంత్ రెడ్డి గుడి నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. ముఖ్యమంత్రి దేవుడు కావడం ఏంటి అనుకుంటున్నారు కదూ.. మీరు ఎలా అనుకున్నా సరే.. జరుగుతోంది అదే.. రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా చిట్యాల మండలంలోని వనిపాకల అనే గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 19న భూమి పూజ చేయనున్నారు..”పది సంవత్సరాలపాటు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. కెసిఆర్ ఎన్నో మాయలు చేసి కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి తన భుజాల మీద కాంగ్రెస్ పార్టీని మోశారు. అధికారంలోకి తీసుకొచ్చారు. జన రంజక పాలన చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రజల ముఖ్యమంత్రిగా పేరు గడించారు. కనిపించని దేవుడి కంటే రాష్ట్ర ప్రజల బాగోదు తీరుస్తున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి మా దేవుడని” రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం అధ్యక్షుడు మేడి సంతోష్ పేర్కొన్నారు.
వాస్తవానికి వ్యక్తి పూజ కు తెలంగాణ ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. కానీ కొంతకాలం నుంచి ఇందులో మార్పు వస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తి పూజ తారస్థాయికి చేరింది. అయితే కెసిఆర్, లేకుంటే కేటీఆర్, వీరిద్దరూ కాకుండా హరీష్ రావు, కవిత.. ఇలా ఈ నలుగురి చుట్టూ భారత రాష్ట్ర సమితి కార్యవర్గం తిరిగేది. కార్యక్రమం ఏదైనా ఆ నలుగురిని ఆకాశానికెత్తేది. అధికారం పోయిన తర్వాత కూడా భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా వర్గం ఆ నలుగురిని కీర్తిస్తూనే ఉంది. వారితో పోలిస్తే రేవంత్ రెడ్డికి వ్యక్తి పూజ తక్కువే అయినప్పటికీ.. ఇటీవల కాలంలో ఇది పెరిగినట్టు కనిపిస్తోంది.
అప్పట్లో జమ్మికుంట ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కెసిఆర్ కు గుడి కట్టాడు. అందులో కేసీఆర్ విగ్రహం పెట్టి పూజలు జరిపేవాడు. భారత రాష్ట్ర సమితిలో కీలకంగా వ్యవహరించినప్పటికీ అతడికి పదేళ్లపాటు సముచిత స్థానం దక్కకపోవడంతో ఆ గుడిని, అందులో ఉన్న కేసీఆర్ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టాడు. అప్పట్లో అదొక సంచలనమైంది. దానిని కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ప్రచారం చేసుకుంది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది.
ఇక రేవంత్ రెడ్డికి గుడి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిరోజు ఆయన విగ్రహానికి పూజలు జరుపుతామని రాష్ట్ర రెడ్డి అభిమాన సంఘం అధ్యక్షుడు సంతోష్ చెబుతున్నారు. రేవంత్ వ్యక్తిత్వానికి తాను పెద్ద అభిమానినని, అందుకే గుడి నిర్మిస్తున్నాను ప్రకటించారు.. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, రేవంత్ రెడ్డి గుడి నిర్మాణానికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.