TG Cold Wave: తెలంగాణపై చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని కొన్ని చోట్ల 10 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం(నవంబర్ 20న) రాష్ట్రంలో అత్యల్పంగా సిర్పూర్‌లో 10.5 డిగ్రీల సెల్సియస్, పొచ్చెరలో 11.8. కుంటాలలో 12.6, ర్యాలీలో 13.1 డిగ్రీల సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నవంబర్‌లోనే ఇంత తక్కువగా నమోదవడం ఇదే మొదటిసారని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేసింది.
ఆరు జిల్లాలకు హెచ్చరిక..
కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువన నమోదవుతుండడంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని తెలిపింది. ఈ జిల్లాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
వీరు జాగ్రత్తగా ఉండాలి..
చలి వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఉదయమే వాహనాలు నడిపే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచు కారణంగా రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున వృద్ధులు, పిల్లలు, చిరు వ్యాపారులు, పారిశుధ్య కార్మికులు, తెల్లవారుజామునే వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాబోయే వారం రోజులు వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు.
హెల్త్ అడ్వయిజరీ జారీ..
చలిగాలులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హెల్త్ అడ్వయిజరీ కూడా జారీ చేసింది. చలి నుంచి రక్షించుకోకపోతే హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డకట్టి గాయాలు కావడం, పెర్నియా, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. చలి తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు, మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వేడి వేడి ఆహారం తీసుకోవాలని, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలు ధరించాలని తెలిపింది.