Heat Waves: ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా 40° ఉష్ణోగ్రత అంటేనే భరించలేనంత వేడి ఉంటుంది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలకు వడగాలులు కూడా తోడవుతున్నాయి.. దీంతో ప్రజలు బయటికి వెళ్లడానికే జంకుతున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బయటికి వెళ్లకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం మూడు వరకు ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. కాటన్ దుస్తులు ధరించాలని, సాధ్యమైనంతవరకు ఎక్కువ నీరు తాగాలని, కొబ్బరి బోండాలు, నిమ్మరసం, పండ్ల రసాలు సేవించాలని చెబుతున్నారు. మధుమేహ రోగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎండల్లో బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.
ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంట, మంథని, వెలగటూరు, వీణవంక, అల్లిపూర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా నిడమనూరు, మిర్యాలగూడ, మాతూర్ ప్రాంతాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలోకి వెళ్లాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని, ఉత్తర, భారతదేశంలో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని చెబుతున్నారు. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడి వాతావరణం ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. కొత్తగూడెం, హనుమకొండ, గద్వాల, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నల్లగొండ, నాగర్ కర్నూల్, ములుగు, మంచిర్యాల, నారాయణపేట వంటి ప్రాంతాలలో అధిక వేడి ఉంటుందని తెలుస్తోంది. రాష్ట్రంలో గడచిన కొద్ది రోజులుగా 40 డిగ్రీల సరాసరి ఊష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో రోడ్లపై నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది. చాలామంది ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని ఉదయం, సాయంత్రం పూట మాత్రమే చేస్తున్నారు.
ఉత్తర, మధ్య భారత దేశంలో వీస్తున్న వేడిగాలుల ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 28 నుంచి మే 7 వరకు ఈ వేడిగాలులు వీస్తాయని అధికారులు అంటున్నారు. ఈ వేడి గాలుల వల్ల వాతావరణంలో తేమ తగ్గిపోయి, ఉక్కపోత అధికంగా ఉంటుందని చెప్తున్నారు. సాధ్యమైనంతవరకు ఉదయం లేదా సాయంత్రం మాత్రమే బయటికి రావాలని సూచిస్తున్నారు. అయితే వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం పూట గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఈ గాలుల ప్రభావం అధికంగా ఉంది. ఇటీవల ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. వడగండ్లు కూడా పడ్డాయి.