Telugu Reporter Arrested: ఆ పత్రిక తెలుగు రాష్ట్రాలలోనే సంచలనమైన వార్తలను ప్రచురిస్తుంది. ఆ పత్రికాధిపతి దమ్మున్న జర్నలిస్టుగా పేరుపొందాడు. అటువంటి పత్రికలో ఖమ్మం జిల్లాలో అగ్రికల్చర్ బీట్ చూసే రిపోర్టర్ దందాలకు పాల్పడ్డాడు. అది కూడా అలాంటి ఇలాంటి దందా కాదు.. ఏకంగా సైబర్ నేరానికి పాల్పడ్డాడు. కోట్లు వసూలు చేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. అతడి వ్యవహారం గురించి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిజంగానే చుక్కలు కనిపిస్తున్నాయి.
Also Read: వైభవ్ ఇంకా 9 నెలలు ఆగాల్సిందేనా?
కరీంనగర్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ఖమ్మం జిల్లాలోని ఓ ప్రముఖ పత్రిక విలేకరిని అరెస్ట్ చేశారు. వాస్తవానికి అతడి అరెస్టు ఖమ్మం జిల్లాలో సంచలనం కలిగించింది. సదరు జర్నలిస్టు ఖమ్మం జిల్లాలోని ఓ పత్రికలో అగ్రికల్చర్ బీట్ చూస్తాడు. పేరుకు రిపోర్టర్ మాత్రమే.. అతడి దందాలు మాత్రం వేరే విధంగా ఉంటాయి. ఉదయం మొత్తం పడుకొని ఉంటాడు. రాత్రి మొత్తం మెలకువతో ఉంటాడు. ఇతడికి సపరేట్ గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ ఇతడు చెప్పిన పని చేస్తుంది.. ఇతడు చెప్పిన వ్యక్తిని ఆ గ్యాంగ్ ఏదైనా చేస్తుంది. అందుకే అతడంటే చాలామందికి హడల్. పైగా ఆ పత్రికలో పని చేసే పెద్ద తలకాయకు ఈ రిపోర్టర్ అత్యంత నమ్మకమైన వ్యక్తి. ఇతడి పై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఎన్ని రకాలుగా విమర్శలు వచ్చినా ఆ పెద్ద తలకాయ ఆ విలేఖరిని కాపాడింది. అంతేకాదు కీలకమైన విభాగాలు అతడికి అప్పగించింది. దీంతో ఆ రిపోర్టర్ రెచ్చిపోయాడు.. విచ్చలవిడిగా దందాలకు పాల్పడ్డాడు. మేనేజ్మెంట్ వరకు వీటిని వెళ్లకుండా ఆ రిపోర్టర్ ను పెద్ద తలకాయ కాపాడింది.. పైగా ఆ రిపోర్టర్ తో సర్కులేషన్, యాడ్స్ చేయించడంతో మేనేజ్మెంట్ కూడా సైలెంట్ గా ఉండిపోయింది. ఎందుకంటే మేనేజ్మెంట్ కి కావాల్సింది సర్కులేషన్, యాడ్స్ మాత్రమే. బయట ఎన్ని దందాలు చేసుకున్న పర్వాలేదు. మేనేజ్మెంట్ కు ఇవ్వాల్సింది ఇస్తే సరిపోతుంది.
చేస్తున్న దందాలు సరిపోవడం లేదని ఇటీవల ఆ విలేకరి సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో రెండు సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఆ నేరాలలో ఖమ్మం జిల్లాకు చెందిన ఈ రిపోర్టర్ ను కరీంనగర్ జిల్లా పోలీసులు నిందితుడిగా గుర్తించారు. బుధవారం అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీ ఇప్పిస్తానంటూ సదరు రిపోర్టర్ కోట్లలో పలువురిని మోసం చేసినట్టు తెలుస్తోంది. కేవలం కరీంనగర్ మాత్రమే కాకుండా మహారాష్ట్ర లోనూ ఇతడు పై సైబర్ నేరాలు నమోదైనట్టు తెలుస్తోంది. ఆ కేసుల్లో ఇతడిని నిందితుడిగా చేర్చినట్టు కరీంనగర్ పోలీసులు చెబుతున్నారు. ఖమ్మం నగరంలోని మరో మూడు సైబర్ క్రైమ్ కేసుల్లోనూ ఇతడి పేరు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఖమ్మం నగరంలో నమోదైన మూడు సైబర్ క్రైమ్ లలో ఇతడు ప్రమేయం ప్రత్యక్షంగా ఉందా? పరోక్షమైన పాత్ర పోషించాడా? అనే అంశాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది.
ఇతడు అరెస్టు అయిన నేపథ్యంలో.. ఇతడు గనుక ఆ వివరాలు చెబితే తమ ఉద్యోగాలతో పాటు.. తాము కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఆ పత్రికలో పనిచేస్తున్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆ ప్రయత్నాలు విఫలం అయినట్టు తెలుస్తోంది. ఇతడి సైబర్ నేరాలకు ఆ ఇద్దరు ముఖ్య వ్యక్తులు కూడా తమ వంతు సహకారం అందించారని తెలుస్తోంది. ఇతడు అరెస్టు అయిన తర్వాత వాళ్ళిద్దరూ తమ ఫోన్ లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని తెలుస్తోంది.. అయితే పోలీసులు సదరు విలేకరి కాల్ డాటా మొత్తాన్ని పరిశీలించి.. మరింత లోతుగా సమాచారాన్ని సేకరించి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆ రిపోర్టర్ చేతుల మోసపోయిన వారు కోరుతున్నారు..