Kavitha downfall: తవ్వితే చరిత్ర తెలుస్తుంది. లోతులోకి వెళ్తే అసలు నిజం వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు కవిత ఎపిసోడ్లో కూడా అదే జరుగుతోంది. ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి నుంచి ఆమె సస్పెండ్ అయ్యారో.. అప్పటినుంచి ఆమెకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో తెలంగాణ విటల్ సంచలన విషయాన్ని వెల్లడించారు. అది కాస్త ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనంగా మారింది.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కవిత అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు ఆమె సొంతంగా విటల్, ఇంకా కొంతమందిని అప్రోచ్ అయ్యారు. నాడు విటల్, అల్లం నారాయణ సోదరుడు అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి వంటి వారితో తెలంగాణ టుడే అనే పేరుతో పత్రికను ప్రారంభించారు. మొదట్లో పేపర్, శాటిలైట్ ఛానల్ పెట్టాలని అనుకున్నారు. కానీ అంత ఖర్చు పెట్టే స్థాయి లేక పేపర్ తోనే ఆగిపోయారు. బంజారా హిల్స్ లోని జీవికే ఎదురుగా ఉన్న ఒక భవనాన్ని అద్దెకి తీసుకున్నారు. మూడు నెలల పాటు విజయవంతంగా నడిపిన తర్వాత.. ఒకరోజు ఉన్నట్టుండి విటల్ కు కవిత ఫోన్ చేశారు. తన ఇంటికి రమ్మని ఆయనను ఆహ్వానించారు. విటల్ కూడా తనతో పాటు పనిచేస్తున్న వారితో కలిసి కవిత ఇంటికి వెళ్లారు.
విలపించారు
విటల్ ను చూసిన తర్వాత కవిత ఒక్కసారిగా బోరున విలపించారు..” పత్రికను నడపడం నావల్ల కాదు. పార్టీకి సంబంధించిన మెయిన్ ఎకౌంటు కు నాకు యాక్సెస్ లేదు. అందువల్ల ఇబ్బంది ఎదురవుతోంది. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి. డాడీ వద్దంటున్నారు. హరీష్ బావ కూడా వినిపించుకోవడం లేదు. అన్నయ్య కూడా ఎందుకు నీకు ఇదంతా అని అంటున్నారు. నాకు కూడా ఇబ్బందిగా ఉందంటూ” కవిత విటల్ తో పేర్కొన్నారు. అప్పటిదాకా ఉద్యోగులకు ఇంకా చెల్లించాల్సిన జీతాలు ఉన్నాయి. దీంతో కొంతమంది కంప్యూటర్లు ఎత్తుకొని పోయి వాటిని విక్రయించగా వచ్చిన డబ్బును జీతం లో మినహాయించుకున్నారు. అప్పట్లోనే కవితకు ఊహించినంత స్వేచ్ఛ ఉండేది కాదని విటల్ చెబుతున్నారు. అంతపురం బయటికి ఒకరకంగా.. లోపలికి ఒక రకంగా ఉంటుందని.. లోపలి వాతావరణం కవిత అనుభవించారని విటల్ వ్యాఖ్యానించారు. విటల్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి. అయితే ఇప్పుడు సొంతంగా రాజకీయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని కవిత అనుకుంటున్నారు కాబట్టి.. ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.