Telangana Power: తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో గణనీయమైన పురోగాభివృద్ధి సాధించింది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి పవర్ ఫుల్ తెలంగాణగా అవతరించింది. వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ కీర్తీ.. నేడు దశ దిశలా వ్యాపించింది. ఉమ్మడి రాష్ట్రంలో అంటే 2014కు ముందు విద్యుత్ కోతలతో సహా అనేక సమస్యలను రాష్ట్రం ఎదుర్కొన్నది. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టి సారించి.. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టడమే కాకుండా విద్యుత్ కోతలను అధిగమించి.. మిగులు విద్యుత్ దశకు రాష్ట్రం చేరుకున్నది. అంతే కాకుండా వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తోంది.
వ్యవసాయ విద్యుత్ వంద శాతం సబ్సిడీ
వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీ ఇస్తుంది. ఇందుకు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం ఏటారూ.36 వేల కోట్లు చెల్లిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 26.96 లక్షల వరకు ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కావడం.. కరెంటు కోతలు, పవర్ హాలీడేలకు శాశ్వత ముగింపు ఇచ్చింది. రాష్ట్ర విభజన నాటికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 19.02 లక్షల కనెక్షన్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 26 లక్షల వరకు పెరిగింది.
18,453 మెగావాట్లకు పెరిగిన విద్యుత్ సామర్థ్యం..
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ వ్యవస్థను కూడా మెరుగుపర్చింది. నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందిస్తోంది. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రంలో స్థాపిత విద్యత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు స్థాపిత సామర్థ్యం 18,453 మెగావాట్లకు పెరిగింది. ఇప్పుడు 16 వేల మెగావాట్లకు పైగా అందుబాటులోకి వచ్చింది.
మూడేళ్లలో అదనంగా 12,677 మెగావాట్లు..
తెలంగాణలో పెరిగే విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని 28 వేల మెగావాట్లకు తీసుకుపోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విభజన చట్టంలోని ఇచ్చిన హామీ మేరకు రామగుండంలోని ఎన్టీసీసీ ద్వారా 4 వేల మెగావాట్లకు కేంద్రం నుంచి ఆమోదం తీసుకున్నది. ఇప్పటికే మొదటి దశలలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. 4వేల మెగావాట్ల యాదాద్రి ప్లాంటు నిర్మాణ పనులు త్వరలోనే పూర్తవుతాయి. ఛత్తీష్‌గఢ్ నుంచి రెండో దశలో మరో 1000 మెగావాట్లు, సింగరేణి నుంచి మరో 800 మెగావాట్లు, సీఎన్ జీ ద్వారా 90 మెగావాట్లు, సోలార్ ద్వారా 1,584 మెగావాట్లు, హైడెల్ ద్వారా 90 మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. వీటన్నింటి ద్వారా వచ్చే మూడేళ్లలో 12,677 మెగావాట్లు అదనంగా వచ్చి చేరుతుంది. ఇప్పుడున్న కరెంట్‌ను కలుపుకొంటే మూడేళ్ల తర్వాత తెలంగాణలో 28వేల మెగావాట్లకు పైగా స్థాపిత సామర్థ్యానికి చేరుకుంటుంది. దీంతో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుంది.
తలసరి విద్యుత్ వినియోగం 2,126 యూనిట్లు..
తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. 2014లో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండేది. అది 2021–22 నాటికి 2,126 యూనిట్లకు పెరిగింది. ఈ ఏడాది మరిన్ని యూనిట్ల వరకు తలసరి వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో జాతీయ సగటున పరిశీలిస్తే 1,255 యూనిట్లుగా నమోదైంది. తెలంగాణ తలసరి వినియోగం, జాతీయ తలసరి వినియోగం కన్నా 69శాతం ఎక్కువగా నమోదైంది. విద్యుత్ సరఫరాలో నష్టాలను కూడా అధిగమించింది. 2014లో 16.06 శాతం నుంచి 11.01 శాతం వరకు తగ్గింది.
యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల నిర్మాణం..
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోతల నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రెండు పవర్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. భద్రాద్రిలో 1,080 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్తగూడెం ప్లాంట్‌లోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1,200 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి నిర్మించిన ప్లాంటు కూడా ప్రారంభమైంది.
దీనికి అదనంగా 8,085 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్ జెన్‌కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి పవర్ ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
5,741 మెగావాట్ల సోలార్ విద్యుత్..
ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడే నాటికి సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల ఇప్పుడు రాష్ట్రంలో 5,741 మెవాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతున్నది. దీంతో విద్యత్ సరఫరాలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచిందని ప్రభుత్వం చెబుతోంది.
విద్యుత్ శాఖకు ‘‘అప్పుల’’ షాక్..
రాష్ట్రంలోని డిస్కంలు ఏయేటికాఏడు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నాయి. ఆదాయం సంగతి దేవుడెరుగు.. రోజురోజుకూ అప్పులు పెరిగిపోతుండటంతో సంస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటున్నది. రాష్ట్రంలో ఏదైనా శాఖలో ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందుతున్నాయంటే అది కేవలం విద్యుత్ శాఖలోనే. అలాంటి శాఖ సైతం నష్టాల్లో ఉండటం ఆందోళనను కలిగిస్తున్నది.
రూ.45 వేల కోట్ల నష్టాలు..
ఇదిలాఉండగా వినియోగదారులకు 24 గంటలు కరెంట్‌తో పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం తీరు కారణంగానే సంస్థ నష్టాల ఊబిలో చిక్కుకుంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2015 నాటికి నష్టాలు రూ.2,974 కోట్లు ఉంటే తొమ్మిదేండ్లలో రూ.45 వేల కోట్లకు చేరుకోవడం దీనికి నిదర్శనం.
వినియోగదారులపై భారం
నష్టాల నుంచి గట్టెక్కేందుకు విద్యుత్ సంస్థలు వినియోగదారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా భారాన్ని మోపుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను గృహ విని యోగదారులపై ఒక్కో యూనిట్‌కు రూ.50 పైసల భారం మోపారు. ఎల్‌టీ గృహేతర, హెచ్‌టీ వినియోగదారులపై ఒక్కో యూనిట్‌కు రూపాయి పెంచారు. ఈ చార్జీల పెంపుతో ప్రజలపై ఏటా రూ.5,596 కోట్ల భారం పడుతోంది. కరెంటు చార్జీలు పెంచినా లోటు తగ్గకపోవడంతో డెవలప్ మెంట్ చార్జీలతోపాటు అడిషనల్ కంజప్షన్ డిపాజిట్(ఏసీడీ) చార్జీల పేరిట డిస్కంలు వినియోగదారులపై ఎడాపెడా భారం మోపాయి.
డిస్కంల నష్టాలు (రూ.కోట్లలో)
2018–19 4339.89
2019–20 6056.54
2020–21 6686.31
2021–22 5812
మొత్తం 22897.14