Telangana RTC: తెలుగువారికి ప్రధాన పండుగ సంక్రాంతి. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి సందడి ఎక్కువగా ఉంటుంది. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో వేడుకగా జరుపుకుంటారు. ఉత్తరాంధ్రలో సైతం పండుగ ప్రభావం అధికంగా ఉంటుంది. ఎంత దూరంలో ఉన్న వారైనా సంక్రాంతికి సొంత గ్రామాలకు వస్తారు. అయితే రాష్ట్ర విభజన జరిగింది కానీ ఏపీ ప్రజలు ఎక్కువగా ఉండేది హైదరాబాదులోనే. ఉద్యోగ ఉపాధి నిమిత్తం లక్షలాదిమంది భాగ్యనగరంలోనే ఉంటారు. అటువంటివారు సంక్రాంతి సందర్భంలో సొంత గ్రామాలకు వచ్చేందుకు వ్యయప్రయాసలకు గురవుతారు. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది కానీ.. అవన్నీ ముందస్తుగానే బుక్ అయిపోతాయి. ఇటువంటి తరుణంలో తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సంక్రాంతి ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. శివారు ప్రాంతాల నుంచి ఏపీలో వివిధ జిల్లాలకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమయింది.
ఆ రెండు డిపోల నుంచి..
ప్రధానంగా భాగ్యనగరంలోని బీహెచ్ఈఎల్, ఆర్ సి పురం నుంచి ప్రత్యేక బస్సులు నడప నుండి తెలంగాణ ఆర్టీసీ. ఆర్ సి పురం నుంచి మియాపూర్, కెపిహెచ్బి, ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఏపీలోని అన్ని జిల్లాలకు బస్సులు నడవనున్నాయి. అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రి, పోలవరం, గుంటూరు, చీరాల, విజయవాడ తదితర ప్రాంతాలకు ఈ సర్వీసులు నడుస్తాయి. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ అధికారులు దీనిపై ప్రత్యేక ప్రకటన కూడా చేశారు.
ఆర్ సి పురం నుంచి నడిచే సంక్రాంతి స్పెషల్ బస్సులు జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయి. వీటికోసం ఆన్లైన్ బుకింగ్, ముందస్తు రిజర్వేషన్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీ వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికుల రద్దీని అనుసరించి బస్సుల సంఖ్య కూడా పెంచే అవకాశం ఉంది.