Telangana Political Controversies: “ఇక్కడ అప్పు పుట్టక.. అక్కడ పప్పు ఉడకక!” అన్న చందంగా తయారైంది తెలంగాణ హస్తం పార్టీ పరిస్థితి. సొంత రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి పైసల్లేక, బ్యాంకులు మొహం చాటేస్తుంటే.. పక్క రాష్ట్రం కేరళకు వెళ్లి “మేము తెలంగాణను స్వర్గం చేసేశాం” అని ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా నవ్వులపాలు అవుతోంది.
కేరళ ప్రజలంటే అమాయకులనుకున్నారా?
ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో విశ్లేషించే కేరళ ప్రజలకు, తెలంగాణలో జరుగుతున్న “కూల్చివేతల” పర్వం తెలియదనుకోవడం ఆ పార్టీ నేతల అమాయకత్వానికి పరాకాష్ట. మొన్న ఖమ్మంలో పేదల ఇళ్లను కూల్చివేస్తే, సాక్షాత్తు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు ట్వీట్ చేసి మరీ అక్షింతలు వేశారు. అలాంటి చైతన్యవంతమైన ప్రజల దగ్గరకు వెళ్లి “మా పాలన అద్భుతం.. మమ్మల్ని నమ్మండి” అని ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే.. “పిచ్చోడి చేతిలో రాయి” సామెత గుర్తొస్తోంది.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
అక్కడ దొంగలు.. ఇక్కడ అప్పులు!
ఢిల్లీకి వెళ్తే తనను చెప్పులు ఎత్తుకుపోయే వాళ్లలా చూస్తున్నారని ఒకవైపు వాపోతూ.. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని మొత్తుకుంటూ.. మరోవైపు కేరళ పత్రికలకు కోట్లు తగలేసి యాడ్స్ ఇవ్వడం ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. “ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత” అంటే ఇదేనేమో!
ప్రధాని కలలు.. పగటి కలలేనా?
ఈ విచిత్రమైన జిమ్మిక్కులను చూసి, తమ యువనేత ప్రధాని అయిపోతారని కలలు కనడం ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తెలంగాణలో ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించి, కేరళలో ఓట్లు అడగడం చూస్తుంటే.. వీళ్ల రాజకీయ విజ్ఞానం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
ఏది ఏమైనా కేరళ ప్రజలు ఈ ‘అడ్వర్టైజ్మెంట్ రాజకీయాలను’ నమ్మే రకం కాదు. తెలంగాణలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు తెలిసిన వారు, ఈ ఫుల్ పేజీ ప్రకటనలను చూసి “ఏం కామెడీ బ్రో ఇది!” అని నవ్వుకుంటున్నారు. త్వరలోనే కేరళ ప్రజలు ఈ జిమ్మిక్కులకు సరైన సమాధానం చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.