I Bomma Ravi: తెలంగాణ పోలీసులు ఐ బొమ్మ రవికి చుక్కలు చూపిస్తున్నారు. ఇన్ని రోజులపాటు చిత్ర రంగానికి రవి షాక్ ల మీద షాక్ లు ఇచ్చాడు. ఇప్పుడు అతడికి తెలంగాణ పోలీసులు దిమ్మతిరిగి పోయే విధంగా మాస్టర్ స్ట్రోక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే రవిని కొద్దిరోజులుగా తమ కస్టడీలో ఉంచుకున్నారు తెలంగాణ పోలీసులు.. వివిధ అంశాల మీద విచారణ కొనసాగిస్తున్నారు. అతడి వెబ్సైట్ నిర్వహణ.. ఇతర మార్గాల ద్వారా సంపాదించిన సంపాదన.. ఇలా అన్ని విషయాలపై సమాధానాలు రాబట్టారు.
కొన్ని విషయాలపై మాత్రం రవి దాటవేత ధోరణి ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వెబ్సైట్లో కొత్త సినిమాలు అప్లోడ్ చేసే విధానం.. ఇతర దేశాలలో ఉన్న సర్వర్లు.. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసి సాగించిన సంపాదన.. ఈ విషయాలపై పోలీసులు ప్రశ్నిస్తే రవి సమాధానాలు చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించినట్టు తెలుస్తోంది. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు తెలియదు, గుర్తుకులేదు, మర్చిపోయాను అనే తీరుగా సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. అందువల్లే తెలంగాణ పోలీసులు అతడి దగ్గరనుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికి కస్టడీకి సమయం కోరినట్లు తెలుస్తోంది.. అయితే తాజాగా రవిపై పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులలో అతడికి 14 రోజులపాటు రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
రవి మంచు విష్ణుకు సంబంధించి కన్నప్ప, దిల్ రాజు సినిమా గేమ్ చేంజర్, నాగచైతన్య సినిమా తండేల్ లను పైరసీ చేసినట్టు తెలుస్తోంది. వారి ఫిర్యాదు మేరకు రవి మీద పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. దీంతో అతడికి నాంపల్లి కోర్టు మరో 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఇప్పటికే రవికి బెయిల్ మంజూరు చేయకూడదని.. అలా చేస్తే అతడు విదేశాలకు వెళ్లిపోయి ఆధారాలను తారుమారు చేస్తాడని ప్రభుత్వ తరపు న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించారు. అయితే రవికి బెయిల్ మంజూరు చేసే విషయానికి సంబంధించి బుధవారం కోర్టులో విచారణ సాగుతుందని సమాచారం.. అయితే ఇప్పటికే కొంతమంది లాయర్లు రవి తరపున వాదించడానికి సిద్ధమయ్యారు. కొంతమంది ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు.
రవిని అరెస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో అతడికి అనుకూలంగా ఉద్యమం మొదలైంది. పోలీసులు హెచ్చరించినప్పటికీ రవి తరపున ఉద్యమం చేసేవారు ఏమాత్రం ఆగడం లేదు. పైగా పోలీసులను సైతం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. కొందరైతే రవిని రాబిన్ హుడ్ తరహాలో కీర్తిస్తున్నారు. అతడు గొప్ప పని చేశాడని.. చాలామందికి దూరమైన ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చాడని వ్యాఖ్యానిస్తున్నారు.