Telangana Panchayat Elections: తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. మొదటి విడతలో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాలను దక్కించుకున్నారు. గులాబీ పార్టీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలను దక్కించుకుంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలలో దారుణమైన పనితీరు కనబరిచిన గులాబీ పార్టీ.. స్థానిక ఎన్నికలు మాత్రం పర్వాలేదనిపించింది.
సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. పార్టీల మధ్య పొత్తులు కూడా ఊహించని విధంగా ఉంటాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఈసారి ధన ప్రవాహం, మద్యం ప్రవాహం అధికంగా సాగింది.. ఒక్కో ఓటుకు స్థానాన్ని బట్టి చెల్లించారు. శంషాబాద్ లోని ఓ గ్రామంలో ఒక్కో ఓటుకు 15 వేల చొప్పున ఇచ్చారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈసారి జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అనేక రకాలుగా పదనిసలు చోటుచేసుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలోని సోమల తండాలో ఎమ్మెల్యే మురళి నాయక్ అన్న భార్య పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో ఆమె ఇంటింటికి వెళ్లారు. “మాకు ఓటు వేశారా. ఓటు వేశారని ప్రమాణం చేయండి. లేకపోతే మా డబ్బులు మాకు ఇచ్చేయండి. మీరు డబ్బులు తీసుకున్నారు. ఓటు వేయలేదు.. మీరు ఓటు వేయకపోవడం వల్ల మేము ఓడిపోవలసి వచ్చింది. మా దగ్గర డబ్బులు తీసుకొని ఓటు వేయకపోవడం వల్ల ఇవాళ మాకు ఈ దుస్థితి దాపురించిందని” ఆమె ఓటర్లతో వాగ్వాదానికి దిగారు.
వర్ధన్నపేట మండలంలో కూడా ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.. ఈ ప్రాంతంలో పోటీ చేసిన అభ్యర్థి తాను 550 మందికి డబ్బులు పంపిణీ చేశానని.. తనకు మాత్రం కేవలం 55 ఓట్లు మాత్రమే వచ్చాయని.. ఆ 55 మంది మినహా మిగతా వారంతా తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అతడు డిమాండ్ చేశారు. గ్రామంలో పలువురితో వాగ్వాదానికి దిగాడు.