Telangana Municipal Elections 2026: సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య యుద్ధ వాతావరణం ఉంటుంది. పోటాపోటీగా నాయకులు విమర్శలు చేసుకుంటారు. నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. వ్యూహాలు అమలు చేయడం మాత్రమే కాదు.. వాటిని తమకు అనుకూలంగా నడపడంలోనూ క్రియాశీలంగా వ్యవహరిస్తుంటారు.
తెలంగాణలో ఒకప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో యుద్ధ వాతావరణం ఉండేది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో కేసీఆర్ కుటుంబం మీద విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ నుంచి మొదలు పెడితే హరీష్ రావు వరకు కూడా అదే స్థాయిలో ముఖ్యమంత్రికి కౌంటర్ ఇస్తున్నారు. ఫలితంగా మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ కారు పార్టీ అన్నట్టుగా మారిపోయాయి. ఇటీవల స్థానిక ఎన్నికల్లో కమలం పార్టీ కూడా మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో.. తాను కూడా పురపాలక ఎన్నికల్లో సత్తా చూపిస్తామని కమలం పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే కమలం పార్టీ తమ జాతీయ అధ్యక్షుడిని తెలంగాణకు తీసుకొచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది.
తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న ఎన్నికలు జరుగుతాయి. ఇవే కాకుండా ఏడు కార్పొరేషన్లు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఫలితాలు విడుదలవుతాయి. జనవరి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ కూడా ముగిసింది. మొత్తంగా చూస్తే అన్ని ప్రాంతాలలో పోటీ హోరాహోరీగా ఉంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో.. ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ స్థానాలలో గెలుపు తమదేనని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ భారీగా సీట్లను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అదే హవా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన మీద మరింత పట్టు లభిస్తుందని.. వచ్చేసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. అందువల్లే తాము స్థానిక సమస్యలను ఏజెండగా రూపొందించామని.. ఎన్నికలలో ప్రచార ఆస్తులుగా వాటిని ఉపయోగించుకుంటామని గులాబీ నేతలు చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి చుక్కలు చూపించామని.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే ధోరణి కొనసాగిస్తామని కారు పార్టీ నేతలు అంటున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇప్పటికే తమ పార్టీ అధి నాయకత్వం విధివిధానాలకు పొందించిందని.. వాటికి తగ్గట్టుగా పని చేసుకుంటూ పోతామని కారు పార్టీ నేతలు అంటున్నారు. గ్రేటర్ పరిధిలో కారు పార్టీకి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో.. వారికి పార్టీ అధినాయకత్వం టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మెజారిటీ స్థానాలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించినట్టు సమాచారం.
ఇక బిజెపి పట్టణ ఓటింగ్ మీద ప్రధానంగా దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలలో తమకు మెరుగైన ఓటు బ్యాంకు ఉందని కమలంపాటి నాయకులు చెబుతున్నారు. అందువల్లే ఆ పార్టీ నాయకులు మునిసిపాలిటీల వారీగా.. కార్పొరేషన్ల వారీగా ఇన్చార్జిలను నియమించారు. అంతేకాదు వారితో పాటు సమీక్షలను నిర్వహిస్తున్నారు. వరుసగా సమావేశాలు కూడా జరుపుతున్నారు. తెలంగాణలో దాదాపు ఐదు కార్పొరేషన్లు.. సగం మున్సిపాలిటీలను దక్కించుకోవాలని కమలం పార్టీ నిర్దేశించుకుంది. అందువల్లే సేవ్ తెలంగాణ.. ఓటు తెలంగాణ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది…
ఈ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కేడర్ ఉన్నచోట సిపిఎం పోటీ చేస్తుంది. అక్కడ ఉన్న పరిస్థితుల ఆధారంగా సిపిఐ రంగంలో ఉంది. తనకు అవకాశాలకు తగ్గట్టుగా అటు కాంగ్రెస్.. ఇటు గులాబీ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపి.. పోటీలో ఉంది. ఇలా అన్ని పార్టీలు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతిమంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో పాగా వేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఈనెల 13తో వెలుపడే ఫలితాలు అన్ని పార్టీల జాతకాలు బయటపడతాయి.