DSC Notification : గత డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు.. త్వరలో కొత్తది విడుదల! కట్టిన ఫీజుల సంగతేంది?

అయితే ప్రభుత్వం గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మరోమారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించినట్లు తెలిపింది.

Written By: NARESH, Updated On : February 28, 2024 9:58 pm
Follow us on

DSC Notification : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే గతేడాది ఇచ్చిన గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. మరుసటి రోజే అదనపు పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చింది. పరీక్ష నిర్వహణ తేదీని కూడా నోటిఫికేషన్‌లోనే పేర్కొంది. ఇక తాజాగా గత ఆగస్టులో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. రెండు మూడు రోజుల్లో 11 వేలకుపైగా పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వడానికి అనుగుణంగా గత నోటిఫికేషన్‌ రద్దు చేసింది.

గతంలో 5,089 పోస్టులకు..
2023 ఆగస్టులో 5,089 పోస్టులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. వాటికి 1,77,502 దరఖాస్తులు వచ్చాయి. అయితే రాష్ట్రంలో 13 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని నాటి సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కానీ నోటిషికేషన్‌ సగం పోస్టుకు కూడా ఇవ్వలేదు. దీనిపై నిరసనలు వ్యక్తమయ్యాయి. అయినా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది.

11 వేల పోస్టుతో కొత్త నోటిఫికేషన్‌..
ఇక వచ్చే రెండు మూడు రోజుల్లో రేవంత్‌ సర్కార్‌ 11 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్‌ ఇవ్వడానికి కసరత్తు చేసింది. ఈమేరకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది. లోక్‌సభ ఎన్నికలలోపు నోటిఫికేషన్‌ విడుదల చేయడం ఖాయం. ఇక పరీక్ష తేదీ కూడా మే నెల మూడో వారంలో ఉంటుందని తెలుస్తోంది. పది రోజులపాటు పీక్షలు నిర్వహిస్తారని సమాచారం. 11 వేల పోస్టుల్లో 6,500 పోస్టులు ఎస్‌జీటీవే అని తెలిసింది. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 1500–2000 వరకు ఉంటాయని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4 లక్షల మంది టెట్‌ ఉత్తీర్ణత పొందారు. వీరంతా డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

దరఖాస్తు చేసుకున్న వారికి ఊరట..
ఇక గత ఆగస్టులో వచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా విడులైన 5,089 పోస్టులకు 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పేపర్‌కు రూ.700ల ఫీజు చెల్లించారు. పాత నోటిఫికేషన్‌ రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు ఆందోళన చెందారు. అయితే ప్రభుత్వం గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మరోమారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించినట్లు తెలిపింది.