తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగ రానే వచ్చింది. తెలంగాణలో దసరా పండుగకి ప్రత్యేక స్థానం ఉంది. దసరా కంటే ముందు నుంచి నిర్వహించే బతుకమ్మ పండుగ అంటే ఎంతో ప్రత్యేకం. ఊరు, వాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా తెలంగాణ ఆడపడుచులంతా ఉత్సాహంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు.

పండుగ పూట ఏ అడబిడ్డ ముఖం చిన్నబోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఏడాది పెద్ద మనసుతో ఆడబిడ్డలకు చీరలను కానుకగా అందిస్తోంది. అయితే నేటి నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే చీరలు జిల్లాలకు చేరాయి. అక్కడి నుంచి గ్రామాల వారిగా అధికారులు సరఫరా చేశారు. ఈనెల 6వ తేదీ వరకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగున్నట్లు అధికారులు తెలిపారు. అయితే 18 ఏళ్లు పైబడి రేషన్ కార్డులో పేరు నమోదైన వారికి చీరలను పంపిణీ చేయనున్నారు.
ఈ ఏడాది 810 రకాల చీరలను, 1.08 కోట్ల మహిళలకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 333.14 కోట్ల ఖర్చు చేసింది. అయితే ఈసారి సరికొత్తగా ఏకంగా 290 రంగుల్లో బతుకమ్మ చీరలు తయారు చేయించారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో పంపిణీ పై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 300 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.