Telangana Geetam: తెలంగాణ రాష్ట్రగీతం ఖరారు.. జూన్‌ 2న ఆవిష్కరణ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలు ఊగించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది.

Written By: Raj Shekar, Updated On : May 22, 2024 11:11 am

Telangana Geetam

Follow us on

Telangana Geetam: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తికావస్తోంది. కానీ, ఇప్పటి వరకు రాష్ట్రానికి సొంత గేయం అధికారికంగా నిర్ణయించలేదు. రాష్ట్ర వృక్షం, రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు, రాష్ట్ర అధికారిక లోగో, అధికారిక భాషను నిర్ణయించిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర గేయాన్ని మాత్రం ప్రకటించలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర గేయాన్ని ఖరారు చేసింది. దీనిని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్‌ 2న ఆవిష్కరించాలని నిర్ణయించింది.

రాష్ట్ర గేయం ఇదే..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలు ఊగించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. వచ్చే జూన్‌ 2 నాటికి తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ గీతాన్ని ఆవిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.

తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా..
రాష్ట్ర గీతం తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా, అస్తిత్వ ప్రతీకగా, ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా ఎలుగెత్తేలా, సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా అందెశ్రీ రాశారు. ఈ గీతం నిడివి 6 నిమిషాలు ఉంటుంది. అందులో మార్పులేమీ చేయకుండా.. యథాతథంగా ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో, దేశవిదేశీ ప్రముఖులు హాజరైన సందర్భాల్లో వినియోగించడానికి వీలుగా గీతాన్ని 60 నుంచి 90 సెకన్ల నిడివి మించకుండా రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ప్రధాన గీతంలోని భావోద్వేగాలను అలాగే కొనసాగిస్తూ నిడివి తగ్గించేందుకు అందెశ్రీకి పూర్తి స్వేచ్ఛ, బాధ్యత, అధికారం అప్పగించారు.

కీరవాణి సంగీతం..
ఇక రాష్ట్ర గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తే బాగుంటుందని అందెశ్రీ సూచించారు. ఈమేరకు ఆస్కార్‌ అవార్డు గ్రహీత కీరవాణి కూడా ముందుకు వచ్చారు. గీతాన్ని కుదించేందుకు అందెశ్రీతో కలిసి పనిచేస్తున్నారు. ఈమేరకు ఇద్దరూ మంగళవారం(మే 21న) సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చర్చించారు. జూన్‌ 2 నాటికి ప్రధాన గీంతంతోపాటు తక్కువ నిడివితో కూడిన గీతాన్ని సిద్ధం చేయాలని సీఎం సూచించారు.