Telangana Govt Jobs
Telangana : తెలంగాణలో మరోమారు ఉద్యోగాల జాతర నెలకొననుంది. రాష్ట్రంలో 10,954 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలు వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి ఉద్దేశించినవి. ఇది నిరుద్యోగులకు కొత్త అవకాశాలను కల్పించే దిశగా ఒక అడుగుగా భావించబడుతోంది.
Also Read : ఏపీలో డీఎస్సీకి లైన్ క్లియర్.. నోటిఫికేషన్ కు కసరత్తు!
రెవెన్యూ గ్రామాధికారులుగా..
రాష్ట్రంలో తిరిగి గ్రామ రెవెన్యూ అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. ప్రతీ గ్రామంలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండేలా ’జూనియర్ రెవెన్యూ అధికారి (జేఆర్‌ఓ)’ పేరుతో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనుంది. ఈ ప్రక్రియలో గతంలో వీఆర్వోలు, వీఆర్‌ఎలుగా పనిచేసి ఇతర శాఖలకు మారిన వారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఎ) నవీన్ మిత్తల్ కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేశారు.
భూభారతి చట్టం ప్రకారం..
కొత్తగా ఆమోదం పొందిన భూభారతి చట్టం–2024 ద్వారా గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. గతంలో వీఆర్వో వ్యవస్థ రద్దు కాకముందు ఆ పోస్టుల్లో పనిచేసిన వారు, వీఆర్‌ఎలుగా ఉంటూ వివిధ శాఖలకు వెళ్లిన వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వనుంది. డిగ్రీ పూర్తి చేసిన పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఎలను నేరుగా రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని యోచిస్తున్నారు.
ఈ క్రమంలో సుమారు 3,600 మంది పూర్వ వీఆర్వోలు, 2,000 మంది వరకు పూర్వ వీఆర్‌ఎలు ఈ అర్హత కలిగి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మిగిలిన దాదాపు 5,300 పోస్టులను ఎలా భర్తీ చేయాలన్నది ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు, ప్రత్యేకించి గణిత శాస్త్రం చదివిన వారిని కూడా నేరుగా తీసుకునే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, వీరిలో కొందరిని సర్వేయర్లుగా నియమించే ఆలోచన కూడా ఉంది.
1,000 మంది కొత్త సర్వేయర్లు..
రాష్ట్రవ్యాప్తంగా 1,000 మంది కొత్త సర్వేయర్ల నియామకానికి ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో, ఇంటర్ చదివిన పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఎలను సర్వేయర్లుగా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇలా నేరుగా భర్తీ చేసే జూనియర్ రెవెన్యూ అధికారి, సర్వేయర్ పోస్టులు మినహా, మిగిలిన పోస్టులకు రాత పరీక్ష ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో ఓపెన్ దరఖాస్తులు స్వీకరించి ఈ పోస్టులను భర్తీ చేస్తారా లేక పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఎలకు మాత్రమే పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులను ఎంపిక చేస్తారా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఈ ఉద్యోగాలు కొత్త నోటిఫికేషన్ ద్వారా పరీక్షలు నిర్వహించి భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు, అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
Also Read : ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా మూడు రోజులే గడువు..