Telangana Exports: తెలంగాణ ఎగుమతులు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. దేశంలో తెలంగాణ ఎగుమతుల్లో ఏడో ర్యాంకు సాధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన ’హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2024–25’ ప్రకారం, తెలంగాణ ఎగుమతులు 2023–24లో 14,026 మిలియన్ డాలర్ల నుంచి 2024–25లో 19,123 మిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది ఒకేఏడాదిలో 5,097 మిలియన్ డాలర్ల (సుమారు 5 వేల మిలియన్ డాలర్ల) పెరుగుదల. 2017–18 నుంచి ఎనిమిదేళ్ల డేటాలో దేశంలో ఎగుమతుల విలువలో తెలంగాణకు ఏడో స్థానం లభించింది.
ఐటీ, ఫార్మా రంగా ఉత్పత్తులే ప్రధానం..
తెలంగాణ ఎగుమతుల్లో ఐటీ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు, ఔషధ ఫార్ములేషన్లు, బల్క్ డ్రగ్స్ ప్రధాన భాగం. ఇంజనీరింగ్ వస్తువులు, రసాయనాలు, ఏరోస్పేస్ పరికరాలు, వ్యవసాయ ఉత్పత్తుల్లో విత్తనాలు, బియ్యం, పత్తి కూడా కీలకం. ఐటీ ఎగుమతుల్లో దేశంలో అత్యధిక పెరుగుదల సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గుజరాత్ టాప్, చండీగఢ్ లాస్ట్..
దేశంలో గుజరాత్ ఎగుమతుల్లో మొదటి స్థానం కొనసాగుతోంది. 2024–25లో 1,16,332 మిలియన్ డాలర్లు విలువైన ఎగుమతులు జరిగాయి. అయితే గత మూడేళ్లుగా ఇక్కడ తగ్గుదల కనిపిస్తోంది. చండీగఢ్‌లో ఎగుమతులు అతి తక్కువగా 14 మిలియన్ డాలర్లు మాత్రమే. తెలంగాణ కంటే ఎక్కువ ఎగుమతులు చేసిన రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్.
తెలంగాణ ఎగుమతుల పురోగతి (మిలియన్ డాలర్లలో)
సంవత్సరం ఎగుమతుల విలువ ్ఢ
––––––––––––––––––––––––––––––
2017–18 6,572
2018–19 7,168
2019–20 7,359
2020–21 8,707
2021–22 10,951
2022–23 11,412
2023–24 14,026
2024–25 19,123
దక్షిణ రాష్ట్రాల ఎగుమతుల విలువలు (మిలియన్ డాలర్లలో)
రాష్ట్రం 2023–24 2024–25
––––––––––––––––––––––––––––––––––
ఆంధ్రప్రదేశ్ 19,760 20,782
కర్ణాటక 26,632 30,481
తెలంగాణ 14,026 19,123
తమిళనాడు 43,556 52,074