Telangana Exit Polls: ఆ ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమేనా… వాటి వెనుక వాస్తవం ఎంత?

తెలంగాణలో 17 స్థానాలకు జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ వైరల్‌ అవుతున్నాయి. భారత ఎన్నికల సంఘం 2024, ఏప్రిల్‌ 19 నుంచి జూన్ 01 సాయంత్రం 6:30 గంటల వరకు ఎలాంటి సర్వే ఫలితాలు విడుదల చేయొద్దని, ప్రసారం చేయొద్దని స్పష్టం చేసింది.

Written By: Raj Shekar, Updated On : May 19, 2024 4:23 pm

Telangana Exit Polls

Follow us on

Telangana Exit Polls: దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఏడు విడతల్లో 543 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, ఇప్పటి వరకు 4 విడతల పోలింగ్‌ పూర్తయింది. నాలుగో విడతలో తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ జరిగింది. తెలంగాణలో 17 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఏపీలో 25 లోక్‌సభ స్థానాలతోపాటు 175 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. పోలింగ్‌ జరిగి వారం గడిచింది. అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. కనీసం ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా విడుదల చేయలేదు. ఫలితాలకు ఇంకా 15 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో 3 మీడియా సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంతుందో తెలుసుకుందాం.

తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌ వైరల్‌..
తెలంగాణలో 17 స్థానాలకు జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ వైరల్‌ అవుతున్నాయి. భారత ఎన్నికల సంఘం 2024, ఏప్రిల్‌ 19 నుంచి జూన్ 01 సాయంత్రం 6:30 గంటల వరకు ఎలాంటి సర్వే ఫలితాలు విడుదల చేయొద్దని, ప్రసారం చేయొద్దని స్పష్టం చేసింది. అయితే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మే 15న ఇండియా టుడే, టైమ్స్‌ నౌ, చాణక్య సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇవి తాజా ఎన్నిలకు సంబంధించినవి కావని ఆయా మీడియా సంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం..
ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురణకు సంబంధించిన నియమాలు THE REPRESENTATION OF THE PEOPLE ACT , 1951 యొక్క సెక్షన్‌ 126A లో పొందుపరిచారు. దీనిలో ఉన్న నిబంధనల ప్రకారంగా, ఎన్నికల సంఘం వారు నోటిఫై చేసిన సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించడం కానీ వాటి ఫలితాలని బహిర్గతం చేయడం నిషిద్ధం. ఈ నిబంధనల ప్రకారం.. దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ముగిసే వరకు ఎలాంటి ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేయడానికి వీలులేదు. జూన్‌ 1న సాయంత్రం 06:30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేయొద్దు. ఈ నిబంధనల మేరకు ఇండియా టుడే, టౌమ్స్‌ నౌ, చాణక్య సంస్థలకు సంబందించిన వెబ్‌సైట్‌లలో కానీ, సోషల్‌ మీడియా అకౌంట్లలో వెతకగా ఎలాంటి ఎగ్జిట్‌ పోల్స్‌ కనిపించలేదు. తాము ఎలాంటి ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేయలేదని ఇండియా టుడే తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది.

ఫేక్‌ ఎగ్జిట్‌పోల్స్‌లో ఫలితాలు ఇలా..
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు పరిశీలిస్తే ఒక సంస్థలో బీజేపీకి 12, కాంగ్రెస్‌కు 4, ఎంఐఎం ఒక స్థానం గెలుస్తుందని ఉంది. మరో సంస్థ బీజేపీ 2 స్థానాలు, కాంగ్రెస్‌ 14 స్థానాలు, ఎంఐఎం ఒక స్థానం గెలుస్తుందని ప్రకటించింది. మహబూబ్‌నగర్‌లో పోటీపోటీగా ఉంటుందని పేర్కొంది.