తెలంగాణ +అసెంబ్లీ ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలైంది. కాంగ్రెస్ వర్సస్ బీఆర్‌ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. ఎవరు గెలుస్తారనే సర్వే సంస్థల అంచనాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో హ్యాట్రిక్ విజయంపై బీఆర్‌ఎస్ ధీమాతో ఉంది. బీఆర్‌ఎస్‌ను గద్దె దించుతామన్న ధీమా కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. ఇక సామాజిక సమీకరణలు తమకు కలిపి వస్తాయని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది.
హస్తంకు అనుకూలం..
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలత కనిపిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. క్షేత్ర స్థాయిలో మౌత్ పబ్లిసిటీ బీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్‌కు పాజిటివ్ గా కనిపిస్తోంది. కర్ణాటకలో గెలుపు తరువాత తెలంగాణపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. బీఆర్‌ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలు అమలు చేస్తోంది. ఎన్నికల వేళ అధికారం కాంగ్రెస్‌దే అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఇప్పటి వరకు సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.
కాంగ్రెస్ అదే కలిసొచ్చిందా..
కాంగ్రెస్ తొలి నుంచి వ్యూహాత్మకంగా బీఆర్‌ఎస్‌ను ట్రాప్ చేసింది. కేసీఆర్‌కు గెలుపుపైన ధీమా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేందరికీ సీట్లు ఇవ్వాలని ఛాలెంజ్ చేసింది. కేసీఆర్ కొందరు మినహా దాదాపు సిట్టింగ్ లకే సీట్లు కేటాయించారు. కొందరు ఎమ్మెల్యేలపైన అప్పటికే వ్యతిరేకత ఉందనే నివేదికలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్ లో చేరిన వారిపైన కొన్ని నియోజవర్గాల్లో ఉన్న ప్రభావం పరిగణలోకి తీసుకోకుండా వారికి కూడా అప్పటికే ఇచ్చిన హామీ మేరకు సీట్లు ఖరారు చేశారు. ఇప్పుడు ఆ నిర్ణయాలు కాంగ్రెస్‌కు కలిసి వస్తున్నట్లు విశ్లేషకుల అంచనా.
క్షేత్ర స్థాయిలో ఇలా..
ఇక, ఎన్నికల ముందే ఉద్యోగుల డీఏ, రైతుబంధు నిధులను పూర్తిగా విడుదల చేయటం వంటివి ప్రభుత్వంలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకత్వం చేయలేకపోయింది. సరిగ్గా అదే సమయంలో కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. షెడ్యూల్ ప్రకటనకు ముందు కీలకమైన ఆ సమయంలో కేసీఆర్ పూర్తి స్థాయిలో అందబాటులో లేకపోవటం తో గ్యాప్ వచ్చింది. ఆ సమయాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంది. ఎన్నికల వ్యూహాల్లో సాటి లేని నేతగా ఉన్న కేసీఆర్‌కు దీటుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రణాళికలు అమలు చేస్తోంది. అందుకే గులాబీ పార్టీకే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి 80 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు.