Telangana Election Code 2025: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో నిబంధనలు అమలులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉండడంతో కొన్ని పనులపై పరిమితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా మిగతా జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉండనుంది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఎన్నికల నియమావళిని ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కొత్తగా ప్రభుత్వ పథకాలు ఓపెన్ చేయరాదు. ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించడానికి ఆస్కారం ఉండదు. అయితే రూ. 50 వేలకు మించి నగదును కూడా తీసుకెళ్లరాదు. ఒకవేళ అవసరం ఉంటే ఏం చేయాలంటే?
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత డబ్బు సరఫరాపై పరిమితి ఏర్పడింది. కోడ్ ఉన్న ప్రాంతాల్లో రూ. 50 వేల నగదు కంటే ఎక్కువగా చేతి ద్వారా తీసుకెళ్లరాదు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రూ. 50 వేల లోపు మాత్రమే తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆసుపత్రి, విద్యాసంస్థలు, ఇతర అత్యవసర పరిస్థితి ఏర్పడితే అందుకు సంబంధించిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ఆధారాలు లేకుండా డబ్బులు తీసుకెళ్తే నగదును సీజ్ చేస్తారు. ఆ తర్వాత ఈ డబ్బులు జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి కోర్టులో జమ చేస్తారు.
సెప్టెంబర్ 29 నుంచే కోడు అమల్లోకి రావడంతో నగదు పరిమితిపై నిబంధనలు ఏర్పడ్డాయి. ఇవే కాకుండా గృహ నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు కొత్తవి మంజూరు చేయడానికి ఆస్కారం లేదు. ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభించిన వాటికి నగదు సహాయం చేయవచ్చును. రాజకీయ నాయకులు ఎలాంటి ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడానికి అవకాశం లేదు. ఒకవేళ కరువు ప్రాంతాల్లో లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సహాయం చేయవచ్చును. ప్రభుత్వానికి సంబంధించిన కొత్త పథకాలు ప్రారంభించే అవకాశం ఉండదు. ఉపాధి హామీ ఉద్యోగులు ఇప్పటికే కొనసాగే వారికి పనిని కల్పించవచ్చు. కొత్తగా ఉపాధి హామీ కూలీలను చేర్చడానికి అవకాశం ఉండదు.
ఇక ఈ ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారుల బదిలీలు, కొత్త ఉద్యోగుల పోస్టింగులు వాయిదా పడే అవకాశం ఉంటుంది. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేసే అవకాశం ఉండదు.
ఎన్నికల రావడంతో పాటు తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత కొన్ని నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. దీంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు వరుసగా ఉండడంతో ఆశావాహులు టికెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రణాళికలు ప్రారంభించాయి.