HomeతెలంగాణDGP Ravi Gupta: డబ్బులకు ఆశపడ్డ డిజిపి.. వీడియోలకు లైకులు కొడితే జరిగిందిదీ!

DGP Ravi Gupta: డబ్బులకు ఆశపడ్డ డిజిపి.. వీడియోలకు లైకులు కొడితే జరిగిందిదీ!

DGP Ravi Gupta: డబ్బు ఎవరికీ చేదు కాదు. అగర్బ శ్రీమంతుడైన ముఖేష్ అంబానీ నుంచి రోజు కూలీ కి వెళ్లే వారి దగ్గర వరకు.. ఇలా ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. కొందరికి డబ్బంటే విలాసం. ఇంకొందరికి డబ్బు అంటే అవసరం. అందుకే ధనం మూలం ఇదం జగత్ అనే సామెత పుట్టింది. ఇక ఈ డబ్బు సంపాదనకు కొంతమంది సన్మార్గాలు ఎంచుకుంటే.. చాలామంది దొడ్డిదారులు ఎంచుకుంటారు. అలా దొడ్డిదారులు ఎంచుకున్న క్రమంలో బోర్లా పడుతుంటారు. కొన్నిసార్లు మోసపోతుంటారు. అయితే ఈ జాబితాలో తెలంగాణ డిజిపి రవి గుప్తా కూడా ఉన్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం. పైగా ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఒప్పుకున్నారు. డబ్బు తేరగా వస్తుంది అని చెబితే నమ్మకూడదని.. దాని వెనుక పెద్ద పన్నాగం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన తన అనుభవంలో జరిగిన విషయాన్ని వివరించారు.

శుక్రవారం హైదరాబాదులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణపై సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిజిపి రవిగుప్త తన అనుభవాలు పంచుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక మాజీ డిజిపి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారని తెలిపారు. నేరగాళ్లు అతడి ఖాతా నుంచి కొల్లగొట్టిన డబ్బును తిరిగి తీసుకురావడానికి పోలీసులకు చాలా సమయం పట్టిందని రవి గుప్తా వివరించారు. అంతేకాదు ఉచితంగా డబ్బు వస్తుందని ఎవరైనా చెప్తే నమ్మకూడదని.. ఒకవేళ నమ్మితే దొంగ చేతికి తాళం చేతులు ఇచ్చిన సామెత తీరుగానే ఉంటుందని ఆయన వివరించారు. అందుకే వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ చెప్పకూడదని.. చివరికి కుటుంబ సభ్యులకు కూడా తెలియనీయకూడదని ఆయన పేర్కొన్నారు. ఎవరో కాదు ఉచితంగా డబ్బు వస్తుందని చెబితే తానే కొన్ని వీడియోలకు లైకులు కొట్టానని.. తీరా అసలు విషయం తెలిసి నాలుక కరుచుకున్నానని రవి గుప్తా వివరించారు.

రవి గుప్తా ఓసారి ఏదో పనిమీద ఇతర ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఆయన వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా నడుస్తుండడంతో విమానాశ్రయంలో ఎదురుచూస్తున్నారు. ఈలోగా వీడియోలకు లైక్లు కొడితే డబ్బులు ఇస్తామని కొందరు ఆయనకు ఫోన్ చేశారు. దానికి గుప్త సమ్మతం తెలపడంతో వారు కొన్ని లింకులు పంపించారు. అలా వారు పంపిన వీడియోకు లైక్ లు కొట్టడంతో.. సంబంధిత వ్యక్తులు రవి గుప్తా బ్యాంకు వివరాలు తీసుకున్నారు. ఆయనను ప్రలోభ పెట్టేందుకు ముందుగా 150 రూపాయలు ఆయన ఖాతాలో వేశారు. అయితే ఇక్కడే రవి గుప్తా ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఆయన దగ్గర రెండు బ్యాంక్ ఖాతాలుంటాయి. ఒకటేమో జీరో బ్యాలెన్స్.. మరొకటేమో మెయిన్ ఎకౌంటు. ఆన్లైన్ చెల్లింపులకు ఆయన మెయిన్ ఖాతా లో నుంచి జీరో ఖాతాకు డబ్బులు బదిలీ చేసుకుంటారు. అయితే సైబర్ నేరగాళ్లు రవి గుప్త జీరో ఖాతాలో డబ్బులు తక్కువగా ఉండటంతో ఆయనను వదిలేశారు. అంతేకాదు రవి గుప్తా కూడా సైబర్ నేరగాళ్లకు జీరో ఖాతా వివరాలు అందించారు. దీంతో ఆయన వారి నుంచి బయటపడ్డారు. రవి గుప్త ఏదో డబ్బులు సంపాదించడం కోసం అలా చేయలేదు. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు ఆయన వీడియోలకు లైకులు కొట్టే వ్యక్తిగా కొంతసేపు నటించాల్సి వచ్చింది.

ఇక ఈ విషయాన్ని అధికారులతో పంచుకుని సమాజంలో సైబర్ నేరగాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో వివరించే ప్రయత్నం చేశారు డీజీపీ రవి గుప్త. ఇక తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులను ఫ్రీజ్ చేయడంలో.. అలాగే బాధితులకు తిరిగి ఇవ్వడంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. అంతేకాదు సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ విభాగానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించింది. అన్ని పోలీస్ స్టేషన్లో ఈ విభాగాన్ని అనుసంధానించింది. రాష్ట్రంలో ఏ మూల సైబర్ నేరం నమోదైనా వెంటనే ఈ విభాగానికి తెలియజేసేలాగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1 9 3 0 టోల్ ఫ్రీ నెంబర్ కి ఇప్పటి వరకు 90 వేల ఫోన్ కాల్స్ వచ్చినట్టు పోలీస్ శాఖ చెబుతోంది. ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బులో 128 కోట్లు ఫ్రీజ్ చేసినట్టు వివరిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version