Telangana Assembly: అనుకున్నట్టుగానే తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడి వేడిగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం గవర్నర్ ప్రసంగం ఆద్యంతం భారత రాష్ట్ర సమితి చేసిన తప్పుల మీద సాగడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అనుకున్నట్టుగానే శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం అసెంబ్లీలో ఉదయం ప్రారంభమైంది. ముందుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ విషయం మీద మాట్లాడారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్ తన ప్రసంగం ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లాగా ఉందని విమర్శించారు. గత 55 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంత విధ్వంసానికి గురైందో కేటీఆర్ లెక్కలతో సహా చెప్పారు. కేటీఆర్ కు మాట్లాడే అవకాశం స్పీకర్ చాలాసేపు ఇవ్వడంతో.. ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరి పాలనను కేటీఆర్ ఎండ కట్టారు. ఇదే సందర్భంలో కేటీఆర్ తాము ఎందుకు అప్పులు చేశామో, తమ ఏలుబడిలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పథకాలు ప్రారంభించామో వివరించుకుంటూ వచ్చారు. అయితే సహజంగానే కేటీఆర్ దూకుడుగా మాట్లాడటంతో ఒకానొక దశలో అధికార పార్టీ డిఫెన్స్ లో పడినట్టు కనిపించింది. ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.
ఇక రేవంత్ రెడ్డి తన ప్రసంగం ప్రారంభం నుంచి ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి మీద ఎటాకింగ్ చేశారు. కేటీఆర్ ను ఎన్ఆర్ఐ అని పోల్చిన ఆయన.. సిరిసిల్లలో తెలంగాణ రాష్ట్ర సమితిని అభివృద్ధి చేసిన కేకే మహేందర్ రెడ్డి స్థానాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడుకు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సొరంగం నిర్మిస్తున్నప్పుడు కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రిగా నాయిని నరసింహారెడ్డి ఉన్నారని గుర్తు చేశారు. అప్పుడు దానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత బిడ్డ అయినటువంటి దివంగత పి జనార్దన్ రెడ్డి పోరాడారు అని సభ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. పదేపదే కాంగ్రెస్ పాలన గురించి విమర్శిస్తున్న కేటీఆర్ తన తండ్రి ఎక్కడి నుంచి వచ్చారు గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. నాడు కెసిఆర్ ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని, పాలమూరు పార్లమెంటు సభ్యుడుగా గెలిపించింది కాంగ్రెస్ పార్టీ అని, కేంద్ర మంత్రిని కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి కేటీఆర్ కు చురకలంటించారు.. హరీష్ రావును ఎమ్మెల్యే కాకముందు మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని.. గత 55 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాలపై.. 10 సంవత్సరాల భారత రాష్ట్ర సమితి విధానాలపై తాము చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అంతేకాదు కేటీఆర్ సంధించిన పలు ప్రశ్నలకు కూడా రేవంత్ రెడ్డి చాలా వివరంగా సమాధానం చెప్పారు. ఐదు సంవత్సరాల కాలం ఉందని.. ఈ సమయంలో ప్రతి విషయాన్ని కూడా ఎక్స్ రే రూపంలో ప్రజల ముందుకు తీసుకొస్తామని.. దానికి ఆర్థిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి విక్రమార్క తీవ్ర కసరత్తు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 64 సీట్లు గెలిచిన తమపై 39 సీట్లు గెలిచిన ప్రతిపక్ష పార్టీల నాయకులు అచ్చోసిన ఆంబోతుల మాదిరి మీదికి వస్తే సహించబోమని తేల్చి చెప్పారు. కేటీఆర్ వ్యాఖ్యలను తాము పట్టించుకోబోమని, పిల్లి శాపనార్థాలు పెట్టినంత మాత్రాన ఉట్లు తెగిపడవని, ఇది కేటీఆర్ గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి చురకలాంటించారు. అంతేకాదు చెప్పాల్సిన ఓపిక ఉంటే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పొచ్చని.. అంతటి మనసు లేకుంటే నిశ్శబ్దంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. అతనికి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కాస్త అటు భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.