Homeటాప్ స్టోరీస్కమలంలో కలకలం: బండి, ఈటల మధ్య మాటల యుద్ధం

కమలంలో కలకలం: బండి, ఈటల మధ్య మాటల యుద్ధం

Bandi Sanjay vs Etela Rajendra: క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ కలహాల కాపురంగా మారనుందా. మొన్నటికి మొన్న రాజా సింగ్ వ్యవహారం బీజేపీ పరువు తీయగా, పార్టీ ఎలాగోలా సర్దుకుంటున్న సమయంలో ఇద్దరు బడా నేతల మధ్య మరో వివాదం వర్గపోరుకు కారణమవుతోంది.

ఎన్నికల లొల్లి
స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు నర్మగర్భ వ్యాఖ్యలు చేసుకుంటూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారు. కరీంనగర్ ఎంపీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మాజీ మంత్రి,మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించడంతో ఇరు వర్గాల్లో విబేధాలు భగ్గుమన్నాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వీరిద్దరూ నేతల మధ్య విభేదాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మళ్ళీ అవి అగ్గి రాజేసుకుంటున్నాయి.

మొదటి నుంచి విబేధాలే..
కేసీఆర్ తో విభేదించి బీజేపీలో చేరిన ఈటల హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై గెలిచి స్థానిక బలాన్ని చాటుకున్నారు. కానీ గత ఎన్నికల్లో హుజురాబాద్ తో పాటు గజ్వేల్ లో పోటీ చేసి రెండు స్థానాల్లో ఓటమి చవిచూశారు. కొన్ని నెలల వ్యవధిలోనే జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి గెలవడం తో ఎక్కువ సమయం ఆ నియోజకవర్గం సమస్యలతో బిజీ అయ్యారు. అయితే తన పాత నియోజకవర్గమైన హుజురాబాద్ లో పరిస్థితి చేయిదాటి పోయేవరకు పట్టించుకోలేదని విమర్శలు కూడా ఈటల ను వెంటాడుతున్నాయి. అక్కడ తన వర్గం పార్టీలోని మరోవర్గం తో ఎదుర్కొంటున్న సవాళ్లు ఇప్పుడే ఆయన దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అయితే పార్టీ అధ్యక్ష పోటీలో ఉన్న ఈటల కు కూడా శృంగభంగమైంది. ఈటలకు ఆ పదవి రాకుండా కొన్ని శక్తులు అడ్డుపడ్డారనే అభిప్రాయం ఈటల వర్గంలో వ్యక్తమవుతోంది. అన్ని కలగలిపి వీరిద్దరి మధ్య విభేదాలు మరింత ఎక్కువగా పొడసూపినట్లు తెలుస్తోంది.

అసలు ఏమైందంటే…
మూడు రోజుల క్రితం హుజురాబాద్ ప్రాంతంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, ఈటల వర్గంలో ఆందోళనకు కారణమైంది. లోకసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తనకు తక్కువ ఓట్లు వచ్చేందుకు కొంతమంది పనిచేశారని, స్థానిక ఎన్నికల్లో వారికి టికెట్లు ఇవ్వమంటారా..?
అని బండి సంజయ్ బహిరంగంగా ప్రశ్నించారు. అలాగే కొందరు వ్యక్తులు వర్గాలను ప్రోత్సహిస్తున్నారని, ఇకపై అలాంటివి సహించమని, వ్యక్తి కోసం పనిచేస్తామంటే, ఆ విధానాన్ని పార్టీలో ప్రోత్సహించమని చేసిన వ్యాఖ్యలు ఈటల వర్గాన్ని ఉద్దేశించి అన్నట్టు అంతర్గత ప్రచారం ఊపందుకుంది. వెంటనే
ఈటల వర్గానికి చెందిన ఒక నాయకుడు పార్టీకి రాజీనామా చేయడంతో అంతర్గత విబేధాలు బయటపడ్డాయి.

హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన బిజెపి నాయకులు హుటాహుటిన శామీర్పేట్ లోని ఈటలను కలుసుకొని తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు ఎదురవుతున్న అవమానాలను, పార్టీలో ప్రాధాన్యత లేని పరిస్థితులను ఆయన దృష్టికి తెచ్చారు.దీనికి స్పందిస్తూ ఈటల వారినుద్దేశించి మాట్లాడుతూ కౌంటర్ ఎటాక్ చేశారు. తనకు స్ట్రెయిట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ చేతకాదనీ, తన కార్యకర్తలను స్థానిక ఎన్నికల్లో గెలిపించుకుంటానని స్పష్టం చేశారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పరిణామాలు ఈ పరిస్థితికి దారితీస్తాయోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇద్దరు నేతలు పరోక్షంగా ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యాఖ్యలు స్థానిక ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజేశాయి.

Dahagam Srinivas
Dahagam Srinivashttps://oktelugu.com/
Dahagam Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Politics, Sports, Cinema, General, Business. He covers all kind of All kind of news content in our website.
Exit mobile version