Telangana Assembly
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తిగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్య మధ్యలో బీజేపీ కూడా మెరుస్తోంది. తాజాగా శుక్రవారం(మార్చి 21న) బడ్జెట్‌పై చర్చ మొదలైంది. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోడ్ల నిర్మాణానికి 60–40 పద్ధతి అమలు చేస్తామని చెప్పడంపై హరీశ్‌రావు నిలదీశారు. కాంట్రాక్టర్లకు 40 శాతం ఎలా చెల్లిస్తారో చెప్పాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి(Komati Reddy).. 40 శాతం నిధుల కాంట్రాక్టర్లకు విడతల వారీగా చెల్లిస్తామన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హరీశ్‌రావుకు సూచించారు. పదేళ్లలో రోడ్ల నిర్మాణం జరగలేదని, కాళేశ్వరం నిర్మిస్తే అది కుంగిపోయిందని విమర్శించారు.
ఘాటుగా స్పందించిన హరీశ్..
కోమటిరెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రి హరీశ్ కూడా ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. ఒక్క నల్గొండలోనే రూ.200 కోట్లు ఆర్‌అండ్‌బీ కింద ఖర్చు చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా తాండూరు(Tandoor) ఎమ్మెల్యే బయ్యాని మనోహర్‌రెడ్డి.. మంత్రి వద్దకు వచ్చి.. తాండూర్‌లో రోడ్లు లేకపోవడంతో ఊరికి పిల్లను కూడా ఇవ్వడం లేదని మంత్రి ప్రస్తావించారు. బీఆర్‌ఎస్ మరి రోడ్లు ఎక్కడ నిర్మించిందో చెప్పాలని ప్రశ్నించారు. తర్వాత స్పీకర్‌కు చిట్టీ పంపించారు.
స్పీకర్ కూడా..
ఇక తర్వాత స్పీకర్ కూడా ఈ చర్చలో జోక్యం చేసుకున్నారు. రోడ్లు లేక తమ వికారాబాద్(Vikarabad)జిల్లాలో కూడా పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడంలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్ ఇందులో భాగస్వామి అయ్యారు.
స్పందించిన మాజీ మంత్రి..
స్పీకర్ వికారాబాద్ పరిస్థితిని ప్రస్తావించిన వెంటనే మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రాష్ట్రంలోని అన్ని కొత్త మండలాలకు డబుల్ రోడ్లు వేశామని తెలిపారు. పాత మండలాలకు కాంగ్రెస్ రోడ్డు వేయకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఉందని విమర్శించారు. రోడ్లపై చర్చించేందుకు ఒకరోజు సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు.