Telangana BJP: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు..ఛాన్స్ దక్కేదేవారికి..?

ప్రస్తుతానికి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. టీ-బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కూడా కిషన్ రెడ్డినే నిర్వర్తిస్తున్నారు. అలాగే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచిన డీకే అరుణ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు.

Written By: Neelambaram, Updated On : June 7, 2024 1:42 pm

Telangana BJP

Follow us on

Telangana BJP: ఈనెల 09న నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మంత్రివర్గ కూర్పు పై బిజెపి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య ఒక అవగాహన కుదిరింది. ప్రతీ నలుగురు ఎంపీల్లో ఒకరికీ మంత్రి పదవి కేటాయించాలని నిర్ణయించారు. ఈ చొప్పున ఏపీలో 16 ఎంపీ సీట్లను గెలుచుకున్న టిడిపికి నాలుగు మంత్రి పదవులు, జేడీయూకు 03,జనసేనకు ఒక సహాయ మంత్రి చొప్పున పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే తెలంగాణ నుంచి బిజెపి తరఫున 8 మంది లోక్సభకు ఎన్నికయ్యారు. వీరిలో ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవులు దక్కొచ్చనే ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతానికి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. టీ-బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కూడా కిషన్ రెడ్డినే నిర్వర్తిస్తున్నారు. అలాగే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచిన డీకే అరుణ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డిని అవసరమైతే మంత్రి పదవి నుంచి తప్పించి రాష్ట్ర బాధ్యతలు అప్పగించడమో లేదా ఆయనకి కేంద్ర మంత్రి పదవిలోనే ఉంచి మరొకరికి స్టేట్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడమో వంటి నిర్ణయాలను అధినాయకత్వం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన రాష్ట్ర పార్టీ పగ్గాలను తిరిగి బండి సంజయ్ కి అప్పగించవచ్చని ప్రచారం ఉంది. అలా అయితే కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డిని కొనసాగిస్తూనే.. మరొకరికి సహాయం లేదా మరో మినిస్ట్రీ పోస్టును ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ లెక్కన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటలకు కేంద్ర మంత్రి పదవి రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అలా కాకుండా డీకే అరుణ లేదా బండి సంజయ్ ని కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకొని ఈటెల రాజేందర్ కు పార్టీలో లేదా జాతీయ స్థాయిలో ఏదైనా కీలక బాధ్యతలు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కిషన్ రెడ్డి,ఈటెల రాజేందర్,డీకే అరుణ,బండి సంజయ్ లలో ఇద్దరికీ మాత్రం క్యాబినెట్లో బెర్త్ కన్ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కిషన్ రెడ్డి కనుక కేంద్రమంత్రి పదవిలో కొనసాగితే..ఆయనను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించనున్నారు. కిషన్ రెడ్డి స్థానంలో ఒక బీసీకి ఈసారి అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని అధిష్టానం భావిస్తుంది. అయితే టీబీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించే వ్యక్తి పూర్తిగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నేతకావాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే టీబీజీపీ అధ్యక్షులుగా బండి సంజయ్ తిరిగి బాధ్యతలు స్వీకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్ లేదా డీకే అరుణలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది మాత్రం తేలాల్సింది ఉంది.