Telangana Local Body Elections: తెలంగాణలో( Telangana) స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అభ్యర్థులను బరిలో దించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధానంగా అక్కడ అధికార కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి అన్నట్టు ఉంది పరిస్థితి. అయితే ఆ మూడు పార్టీలకు ఇప్పుడు గెలుపు ముఖ్యం. అలా గెలవాలంటే గ్రౌండ్ లెవెల్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం. అసలు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అభిప్రాయం ఏంటి? అనేది మాత్రం తెలియడం లేదు. మొన్న ఆ మధ్యన హడావిడి చేసిన టిడిపి నాయకత్వం ఇప్పుడు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. దీంతో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందా? లేకుంటే తప్పుకుంటుందా? లేకుంటే ఏ పార్టీకైనా మద్దతు తెలుపుతుందా? అన్నది మాత్రం తెలియడం లేదు. వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తే తప్పకుండా అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చినట్టే.
* కాంగ్రెస్ కే లాభం
తెలంగాణలో తెలుగుదేశం ( Telugu Desam) పార్టీని దారుణంగా దెబ్బతీశారు కెసిఆర్. అందుకే అక్కడ టిడిపి శ్రేణులు గులాబీ పార్టీ వైపు వెళ్లే ఛాన్స్ లేదు. అయితే ఏపీలో బిజెపితో కలిసి ఉంది తెలుగుదేశం. ఎన్డీఏ లో కీలక భాగస్వామి. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కలుపు కెళ్లే ప్రయత్నం చేయలేదు బిజెపి. 2023 ఎన్నికల్లో సైతం జనసేనతో కలిసి వెళ్ళింది తప్ప టిడిపి తో కలిసి వెళ్లేందుకు ఇష్టపడలేదు. అందుకే బిజెపి పట్ల టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన అసహనం ఉంది. కాంగ్రెస్ పార్టీకి నేరుగా మద్దతు తెలిపే ఛాన్స్ లేదు. అందుకే ఇప్పుడు టిడిపి ప్రకటన కోసం తెలంగాణ రాజకీయ పార్టీలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.
* ఇప్పటికీ బలమైన క్యాడర్..
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకులు లేరు. కానీ క్యాడర్ మాత్రం ఉంది. ఖమ్మం( Khammam) లాంటి జిల్లాల్లో ఇప్పటికీ టిడిపి శ్రేణులు యాక్టివ్ గానే ఉన్నారు. 2023 ఎన్నికల నాటికి చంద్రబాబు జైల్లో ఉన్నారు. అందుకే అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. అయితే అప్పట్లో టిడిపి వ్యూహాత్మక మౌనం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి వరంగా మారింది. కాంగ్రెస్ విషయంలో టిడిపి శ్రేణులకు భిన్న వైఖరి ఉన్న.. రేవంత్ రూపంలో చంద్రబాబును చూసుకుంటారు అక్కడి టిడిపి క్యాడర్. అందుకే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ పరోక్ష సహకారం అందించినట్టే. పోటీ చేయకపోవడంతో టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యాయి. అయితే మొన్న ఆ మధ్యన తెలంగాణలో టిడిపి భవన్ కు వచ్చారు నారా లోకేష్. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం అంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా టిడిపి నాయకత్వం నుంచి కదలిక లేదు. అందుకే టిడిపి ప్రకటన కోసం తెలంగాణ రాజకీయ పార్టీలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. మరి టిడిపి హై కమాండ్ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.