Telangana TDP News: ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారం కోసమే పనిచేస్తుంది. అధికారాన్ని దక్కించుకోవడానికి అడుగులు వేస్తుంది. కాకపోతే అన్ని రాజకీయ పార్టీలకు అధికారం దక్కదు. కొన్ని పార్టీలకు మాత్రమే అధికారం దక్కుతుంది. దక్కిన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి పార్టీలు అనేక మాయలు చేస్తుంటాయి. ప్రజలను మచ్చిక చేసుకోవడానికి రకరకాల పథకాలను అమలు చేస్తుంటాయి. పథకాల అమలు అనేది ప్రజల ఖజానా నుంచి తీసిన డబ్బుల ద్వారానే జరుగుతుంది. అంతేతప్ప రాజకీయ పార్టీలు సొంత డబ్బులను ఖర్చు పెట్టవు. నాయకులు జేబులో నుంచి రూపాయి తీయరు. కాకపోతే ప్రజలకు ఉచితాలను ఎర వేసి అధికారాన్ని దక్కించుకోవడంలో తెలుగు నాట రాజకీయ పార్టీలు ఆరితేరాయి.
ఉచితాలు ప్రకటించినంత మాత్రాన రాజకీయ పార్టీలకు అధికారం దక్కుతుందంటే కల్ల మాత్రమే. అభివృద్ధి, సుస్థిరమైన నాయకత్వం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే ఓటర్లు ఓటు వేస్తున్నారు. నచ్చిన నాయకుడిని గెలిపించుకుంటున్నారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత.. రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత.. రాజకీయ పార్టీలు అధికారం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగు నాట కులాల కుంపటి ఎక్కువ కాబట్టి.. ఆ దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి.
Also Read: తమ్ముడు సినిమా ‘సెన్సార్’ రివ్యూ వచ్చేసింది.. : టాక్ ఎలా ఉందంటే?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉన్నప్పటికీ సింహభాగం తెలుగుదేశం పార్టీదే. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ అధినేత “బాబు” తెలంగాణ రాజకీయాలలో కూడా పున:ప్రవేశించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఆస్థాన న్యూస్ ఛానల్ లో డిబేట్ నిర్వహించారు. ఈ డిబేట్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలపడితే కుర్చీలు కదిలిపోతాయనే భయం మొదలైందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో ఓ న్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని కూడా ఈ సందర్భంగా ఉదహరించారు.
” తెలంగాణలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకులు పదేపదే ” బాబు” ప్రస్తావన తీసుకొస్తున్నారు. బాబు తెలంగాణకు శత్రువు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. హైదరాబాద్ నగరం ఐటి రాజధానిగా మారింది అంటే దానికి కారణం చంద్రబాబు. ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయిలో ఆదాయం సంపాదిస్తోంది అంటే దానికి కారణం కూడా బాబే. ఆ విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. 2014లో జరిగిన ఎన్నికల్లోను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో చాలామంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచారు. చివరికి అధికారం పోతుందనే భయంతో నాడు గులాబీ పార్టీ వారందరినీ తనలో చేర్చుకుంది. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఏదో ఒక బూచి ని కారణంగా చూపి తెలంగాణలో అధికారంలోకి రావాలని గులాబీ పార్టీ అధినేత భావిస్తున్నారు. ఆ భయం చాలు చంద్రబాబు అంటే ఏమిటో చెప్పడానికి అంటూ” టిడిపి నాయకులు అంటున్నారు. “దేశం” నాయకుల మనోగతాన్ని ప్రతిబింబిస్తూ.. టిడిపికి అనుకూలంగా ఉన్న ఒక ఆస్థాన చానల్ సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక డిబేట్ పెడుతోంది. తెలంగాణలో ఒక చర్చ నడిపిస్తోంది. కాకపోతే క్షేత్రస్థాయిలో అంతగా బలం కనిపించని నేటి రోజుల్లో టిడిపి గెలుస్తుందా? నేతల ఆశ తీరుతుందా? అంటే దీనికి సమాధానం లభించని పరిస్థితి.