ACB Raids: ఒకవైపు ప్రభుత్వం ఉద్యోగం.. మరోవైపు వ్యవసాయ పనులు.. ఇంకోవైపు సేవా కార్యక్రమాలు. ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎంతోమంది కి ఆదర్శంగా నిలిచిన సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ తస్లీమా. ముఖ్యంగా కరోనా సమయంలో ఆమె ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి గిరిజనులకు అండగా నిలిచారు. సరుకులు నెత్తిన పెట్టుకుని అడవులు, కొండలు, వాగులు దాటి గిరిజన గూడేలకు చేరుకున్నారు. ఇక సెలవు రోజుల్లో తన స్వగ్రామానికి వెళ్లి వ్యవసాయ పనులు చేయడం, ఆ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా చాలా మందికి దగ్గరయింది.
లంచం తీసుకుంటూ..
మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న తస్లీమా భూమి రిజిస్ట్రేషన్ విజయంలో మార్చి 22న లంచం తీసుకుంటూ ఏసీబీకి రెండ్ హ్యాండెడ్‌గా చిక్కారు. పక్కా సమాచారంతో ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య, ఇన్‌స్పెక్టర్లు శ్యాంసుందర్, రాజు, సునీల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడులు చేశారు. దాట్ల గ్రామానికి చెందిన గుండెగాని హరీశ్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాలను డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు.
అసలేం జరిగిందంటే…?
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గునిగంటి హరీశ్ కొద్ది రోజుల క్రితం దంతాలపల్లిలో 128 గుంటల భూమి కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెల్లాడు. నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫీజు చెల్లించాడు. అయితే అధికారులు అదనంగా డబ్బులు డిమాండ్ చేశారు.
సబ్ రిజిస్ట్రార్‌ను కలిసినా..
దీంతో హరీశ్ ఈవిషయంపై సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను కలిశాడు. అయినా అదే రీతిలో మాట్లాడుతూ కార్యాలయ ఉద్యోగి వెంకట్‌ను కలవాలని సూచించారు. దీంతో హరీశ్ వెళ్లి వెంకట్‌ను కలిశాడు. నిబంధనల ప్రకారం స్క్వేర్ యార్డ్‌కు రూ.105 ఉండగా, రూ.200 చెల్లిస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని వెల్లడించాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని హరీశ్ ఏసబీని ఆశ్రయించాడు.
పక్కా ప్రణాళికతో..
అధికారుల సూచనలతో మళ్లీ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని వెకంట్‌ను కలిశాడు. స్వేయర్ యార్డ్‌కు రూ.150 చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. పక్కా ప్రణాళిక ప్రకారం శుక్రవారం సాయంత్రం డబ్బులు అప్పగించేందుకు రూ.19,200 తీసుకుని వెంకట్, తస్లీమా వద్దకు వెళ్లాడు. హరీశ్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా, ఉద్యోగి వెంకట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా రూ.19,200 స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించి లెక్క తేలని మరో రూ.1,72,000 స్వాధీనం చేసుకున్నారు.