Swarnalatha Bhavishyavani: ప్రతి ఏడాది ఆషాఢం సందర్భంగా తెలంగాణలో బోనాల పండుగ జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాదులో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. గోల్కొండ బోనాలతో మొదలైన వేడుక ఉజ్జయిని మాతకు సమర్పించే బోనాలతో ముగుస్తుంది. ఉజ్జయిని బోనాల సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి చెబుతుంది. భవిష్యవాణి చెప్పే సమయంలో స్వర్ణలతను అమ్మవారు ఆవహిస్తారని భక్తులు అంటుంటారు. ఆ సమయంలో ఆమె చెప్పే మాటలు భవిష్యత్తు కాలాన్ని సూచిస్తాయని నమ్ముతుంటారు.
Also Read: ఏపీకి అవార్డుల పంట.. హస్తకళలు, ఆహార ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు!
ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా స్వర్ణలత భవిష్య వాణి చెప్పారు. ఆ సమయంలో స్వర్ణలత ఎంతో ఉద్రేకంగా ఉంటారు. అమ్మవారిని తలుచుకుంటూ పూనకాలు ఊగుతారు. ఆ తర్వాత రంగం చెబుతారు. భవిష్యవాణి చెప్పుకుంటూ.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. ఈసారి భవిష్యవాణిలో స్వర్ణలత ఆగ్రహంగా మాట్లాడారు. తనకు రక్తం రుచి కొంతైనా చూపించాలని ఆమె భక్తులను కోరారు.. భక్తులు తనను మర్చిపోకూడదని.. తనను శాంతింపజేయాలని.. తన రూపాన్ని కొలుచుకుంటూ ఉండాలని స్వర్ణలత భక్తులకు సూచించారు. ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నప్పటికీ.. మర్చిపోయారని.. ఏడు సంవత్సరాల పొద్దు నుంచి తనను అంతగా పట్టించుకోవడంలేదని స్వర్ణలత దుఃఖపూరిత స్వరంతో వ్యాఖ్యానించారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని.. ద్వేషం పెంచుకుంటే అనర్ధాలు మిగులుతాయని.. వాటి వల్ల సాధించేది ఏదీ ఉండదని స్వర్ణలత పేర్కొన్నారు.. సంస్కృతిని మర్చిపోవద్దని.. సంప్రదాయాన్ని దూరం చేసుకోవద్దని.. అప్పుడు మనిషిగా అన్నిటికి దూరమవుతారని స్వర్ణలత పేర్కొన్నారు.
ఉండాల్సిన పద్ధతులు.. పాటించాల్సిన నిబంధనల గురించి వివరించిన స్వర్ణలత.. మహమ్మారి గురించి కూడా హెచ్చరించారు. వచ్చే రోజుల్లో మహమ్మారి పొంచి ఉందని.. జాగ్రత్తగా ఉండాలని.. స్వర్ణలత సూచించారు..” విపత్తు పొంచి ఉంది. ఏ రూపంలో నుంచి వస్తుందో తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. పద్ధతిగా బతకాలి. మితిమీరిన స్వేచ్ఛ వద్దు. అడ్డగోలుగా ఉండకూడదు. పరిధిలో జీవించాలి.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అత్యాశ వద్దు. స్వార్ధాన్ని ప్రదర్శించవద్దు. దురాశను దూరం చేసుకోవాలి. ప్రేమతోనే అన్నింటికీ దగ్గర అవ్వాలి. భక్తి భావాన్ని మరింత పెంచుకోవాలి. అమ్మలను కొలవాలి. అద్భుతమైన జీవితాన్ని సాకారం చేసుకోవాలని” స్వర్ణలత సూచనలు లాంటి హెచ్చరికలు చేశారు. స్వర్ణలత భవిష్యవాణి వినిపించిన నేపథ్యంలో వచ్చే ఆ ఉపద్రవం ఏంటి.. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది. మరోవైపు కోవిడ్ ముందు కూడా స్వర్ణలత ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత స్వర్ణలత అలాంటి హెచ్చరికలు చేయడం కలకలం రేపుతోంది.. భవిష్యవాణి చెబుతున్న సమయంలో స్వర్ణలత రక్తం కక్కుకుంటూ చనిపోతారని హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి రక్తం కక్కుకుంటూ చనిపోవడం అంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయా? ఏదైనా ఊహించని ఉపద్రవాలు చోటు చేసుకుంటాయా? అవి వ్యాధుల రూపంలో వస్తాయా? ప్రమాదాల రూపంలో వస్తాయా? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి పూర్వకాలంలో కలరా, ఇతర వ్యాధులు ప్రబలినప్పుడు ప్రజలు రక్తం కక్కుకుంటూ చనిపోయే వారట..