Korutla : ఒకరి ప్రాణం తీశారు.. పచ్చని కాపురంలో నిప్పులు పోశారు.. ఇద్దరు ఖాకీలు చేసిన పని

అధికారం ఉంది.. ఖాకీ యూనిఫాం వేసుకున్నాం.. తాము ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారు కొంతమంది పోలీసులు. కానీ, రోజులు మారాయి. ఇప్పుడు ఏదీ దాగడం లేదు. పోలీసుల దౌర్జన్యాన్ని ఎవరూ సహించడం లేదు. అధికారం ఉందన్న కారణంగా రెచ్చిపోయిన ఇద్దరు ఎస్సైలపై వేటు పడింది. ఇద్దరూ ఒకే జిల్లా వాసులు కావడం గమనార్హం.

Written By: Raj Shekar, Updated On : September 28, 2024 10:31 pm
Follow us on

Korutla : కొందరు ఖాకీలు కర్కశంగా మారుతున్నారు. చేతిలో లాఠీ ఉందని, అవసరమైతే తుపాకీకి పని చెప్పొచ్చన భావనతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అమాయకులపై అకారణంగా చేయి చేసుకుంటూ వారి ప్రాణాల మీదకు తెస్తున్నారు. దంపతుల పంచాయితీ, చిన్నచిన్న చోరీలు, అప్పులు, సివిల్‌ తగాదాల్లో వచ్చే ఫిర్యాదుల్లో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే.. వీలైనంత వరకు పోలీసులు రాజీ చేయాలనే చేస్తారు. తీవ్ర నేరారోపణలు అయితేనే లాఠీకి పనిచెప్తారు. కానీ, కొంతకాలంగా అయినదానికి, కానిదానికీ పోలీసులు చేయి చేసుకోవడం, అసభ్య పదజాలతో దూషణలకు దిగడం, అక్రమంగా అరెస్టులకు పాల్పడటం వల్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలో పోలీసులు అకారణంగా కొట్టారన్న మనస్తాపంతో ఓ యువకుడు ప్రాణాలు వదిలిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల క్రూర ప్రవర్తనను మరోసారి బయటపెట్టింది.

దంపతుల గొడవలో తలదూర్చి..
కోరుట్ల ఎస్సై శ్వేత దంపతుల తగాదాలో తలదూర్చి అత్యుత్సాహం ప్రదర్శించారు. భార్య ఫిర్యాదు మేరకు భర్త శివప్రసాద్‌ను ఠాణాకు పిలిపించి విచక్షణా రహితంగా కొట్టి, అసభ్య పదజాలతో దూషించింది. దీంతో మనస్తాపం చెందిన శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. డిపార్ట్‌మెంటు మాత్రం బాధితుడిని కొట్టనే లేదని ఎస్సైని వెనకేసుకొస్తుంది. 2020 అక్టోబరులోనూ ఇదే తరహాలో ఓ మహిళా ఎస్సై పేకాట ఆడుతున్న వారిని పట్టుకుని చితకబాదడంతో సాయికిరణ్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక జగిత్యాల జిల్లా రాయికల్ ఎస్సై అశోక్‌ ఓ మహిళా కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. వేధింపులకు పాల్పడా‍్డడు. జిల్లా పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దీంతో ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇద్దరిపై వేటు..
ఇద్దరు ఎస్సైల తీరుపై జిల్లా పోలీసు అధికారులు మల్టీజోన్‌ ఐజీకి నివేదిక సమర్పించారు. ఇద్దరిపై విచారణ నిమిత్తం రాయికల్‌ ఎస్సై అశోక్‌ను సస్పెండ్‌ చేశారు. డిపార్ట్‌మెంట్‌కు చెందిన కానిస్టేబుల్‌ను వేధించినందుకు చర్యలు తీసుకున్నారు. ఇక దంపతుల విషయంలో తలదూర్చిన కోరుట్ల ఎస్సై శే‍్వతను హెడ్‌ క్వార్టర్‌కు అటాచ్‌ చేస్తూ మల్టీజోన్‌ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.