Jagadishwar Reddy : మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును తెలంగాణలోకి అడుగుపెట్టకుండా తరిమేశామని అన్నారు. దీంతో బీఆర్ఎస్ లోపల దాగున్న విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాలు చంద్రబాబును రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వలేదని జగదీశ్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఒకసారి తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తే తన్ని తరిమేశాం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేడు తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణాజలాల విషయంలో రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబుకు, మోడీకి తలొగ్గి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన వాటా నీటిని తరలించుకుని పోతుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడేందుకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒంట్లో వణుకు పుడుతోందని అన్నారు. చంద్రబాబు ద్వారా పైరవీ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందామనే ఆలోచనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు ఎదురు మాట్లాడట్లేదని విమర్శించారు. బీజేపీని అడగడానికి కాంగ్రెస్ కు దమ్ము లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి బీ టీం అన్నారు. అందుకే చంద్రబాబుతో మాట్లాడే ధైర్యం అటు రేవంత్ రెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగదీశ్వర్ రెడ్డి చేసి నేడు చంద్రబాబును టార్గెట్ చేశారు. జగదీశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృష్ణా జలాల దోపిడీని తీవ్రంగా విమర్శించారు. ఏపీ ప్రభుత్వానికి గల నీటి లాభాలను.. తెలంగాణకు రావాల్సిన వాటాతో పోల్చితే తక్కువగా ఉన్నాయని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వపు నీటి దోపిడీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను కూడా తప్పు పట్టారు. నీటి విషయంలో రెండు పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఇంతకు ముందూ కాంగ్రెస్, బీజేపీ ఏకకాలంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసినట్లు తెలిపారు.
వాస్తవానికి శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీళ్ల గురించి ఎన్నాళ్లుగానో రెండు రాష్ట్రాల మధ్య చెడిందన్న విషయం తెలిసిందే. ప్రాజెక్టుల్లో నీళ్లన్నీ తమకే చెందుతాయని తెలంగాణ అంటుంటే.. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తన వాటాకు మించి వినియోగించుకుంటుందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ప్రేక్షక పాత్ర పోషించకుండా తగు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తరచూ కృష్ణా బోర్డుకు లేఖలు రాస్తూనే ఉన్నాయి. కృష్ణా నీటిలో ఏపీకి 66 శాతం వాటాగా, తెలంగాణ వాటా 34 శాతంగా నిర్ణయించింది. కానీ పంపకాల్లో తేడాలు ఉంటున్నాయని తెలంగాణ నాయకులు, రైతులు తరచూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని మరో సారి గుర్తు చేశారు. నీటికోసం ప్రస్తుత ప్రభుత్వం పోరాడాలని.. అలా చేయకుండా మంత్రులు ఆ ప్రభుత్వంతో లాలూచి పడుతున్నారని ఆరోపించారు. నీటి పంచాయితీలో ఇతర రాష్ట్రాలు గట్టిగా పోరాడుతున్నాయని.. తెలంగాణకు రావాల్సిన హక్కుల పై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడడం లేదని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో రాష్ట్రం నీటి పరంగా మరింత ధృఢంగా నిలబడలని.. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన నీటి వాటాను సాధించాల్సిన అవసరం ఉందన్నారు.