Supreme Court : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు(Supreme Court)లో బుధవారం(ఏప్రిల్ 2న) విచారణ చేపట్టింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం గురించి సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ తరఫున వాదనలు పూర్తయ్యాయి, అయితే స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫు వాదనలు కొనసాగుతున్నాయి. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి(Mukul Rohithgi), స్పీకర్ తరఫున వాదిస్తూ, ‘కోర్టులు స్పీకర్‌ను ఆదేశించలేవు, కేవలం సూచనలు మాత్రమే చేయగలవు‘ అని పేర్కొన్నారు. దీనికి జస్టిస్ బీఆర్ గవాయ్(Justice Gavai) స్పందిస్తూ, ‘నాలుగేళ్ల పాటు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఊరుకోవాలా? ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదా?‘ అని ప్రశ్నించారు.
Also Read : దక్షిణాదిపై బిజెపి స్కెచ్.. ఆ ఇద్దరితో మల్టీ స్టార్ వ్యూహం!
కోర్టులు శక్తిహీనమైనవి కావు..
ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు గల అధికారాలను ఉటంకిస్తూ, ‘కోర్టులు శక్తిహీనమైనవి కావని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. ‘సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన తర్వాతే స్పీకర్(Speaker) ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఇంతకు ముందు ఎందుకు చర్యలు తీసుకోలేదు?‘ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో బీఆర్‌ఎస్, ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించాలని కోరింది. ఈ విచారణలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్‌ల ధర్మాసనం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కేసు ప్రజాస్వామ్య సూత్రాలు, పదవీ దుర్వినియోగం, రాజకీయ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు దృష్టిని ఆకర్షిస్తోంది.
అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదనలు..
ఇక విచారణలో భాగంగా అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదనలు వినిపించేందుకు సమయం కావాలని ముకుల్ రోహత్గి సమయం కోరారు. అయితే ఎక్కువ సమయం ఇవ్వకుండా గురువారం(ఏప్రిల్ 3) ఉదయం 10:30 గంటల వరకు విచారణ వాయిదా వేశారు. దీంతో గురువారం కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది.
Also Read : రేవంత్‌పై వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరిక!