RK Kotha Paluku: కొన్ని విషయాల గురించి.. అంతర్గతంగా జరిగే సంభాషణల గురించి జర్నలిస్టులు చెప్పరు. ఎందుకంటే రాజకీయ నాయకులకు, వారికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం అటువంటిది. దానిని ఒక రకంగా సయామీ కవలల అనుబంధం అనుకోవచ్చు.. కానీ ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణ ఈ జాబితాలోకి రాడు. ఒక చంద్రబాబు విషయం మినహాయిస్తే.. మిగతా అన్నింట్లో వేమూరి రాధాకృష్ణది ఓపెన్ హార్టే.
ప్రతి ఆదివారం తన పత్రికలో కొత్త పలుకు శీర్షికన వేమూరి రాధాకృష్ణ వర్తమాన రాజకీయాలపై విశ్లేషణ చేస్తూ ఉంటాడు. ఈ ఆదివారం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఓ బొంబాట్ విషయాన్ని బయటపెట్టాడు. ఇలాంటి అంతర్గత విషయాలను బయట పెట్టడం నమస్తే తెలంగాణకు చేతకాదు. సున్నితమైన అంశాలను ప్రజలకు చేరువ చేయడం ఆ పత్రిక వల్ల కాదు. ఈ విషయంలో వేమూరి రాధాకృష్ణకు నూటికి నూరు మార్కులు వేయాలి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం దాటింది. అయినప్పటికీ ప్రతిపక్షం చేస్తున్న ప్రతి విమర్శకు తలవంచుతోంది. చేస్తున్న ప్రతి పనిని చెప్పుకోలేక ప్రజల ముందు తల దించుతోంది. దీంతో ప్రభుత్వం ఏమీ చేయలేదనే ఒక భావన ప్రజల్లో బలంగా వెళ్తోంది. ఇది సహజంగా అధికార పార్టీకి ఇబ్బందికరమైన పరిణామం. అయితే ఇలాంటి ఇబ్బంది ఎందుకు వచ్చింది? ఎక్కడ ప్రభుత్వానికి సమస్య ఎదురవుతోంది? అనే ప్రశ్నలకు వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకు ద్వారా సరైన సమాధానం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ ను నియమించిన జాతీయ అధిష్టానాన్ని అభినందించిన ఆయన.. రేవంత్ విషయంలో చేస్తున్న తప్పును ఎండగట్టారు. అన్ని శాఖలో ముఖ్యమంత్రిని వేలు పెట్టనీయకుండా, కాలు పెట్టనీయకుండా తొక్కి పడేసిన విధానాన్ని రాధాకృష్ణ ఎండగట్టారు. దీనివల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని రాధాకృష్ణ మండిపడ్డారు. ” రేవంత్ రెడ్డికి మంచి రోజులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ రావడం ఇందుకు నిదర్శనం. గతంలో ఇన్చార్జిలుగా వ్యవహరించిన వారు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. పార్టీ శ్రేయస్సును పట్టించుకోకుండా స్వప్రయోజనాలను చూసుకున్నారు. దీపా దాస్ మున్షీ కూడా దానికి భిన్నంగా ఏమీ లేరు. ఆమెను సంతృప్తి పరిచిన వారికి అనుకూలంగా అధిష్టానానికి నివేదికలు పంపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్చార్జిగా ఉన్న గులాబ్ నబి ఆజాద్ కూడా భారీగా ముడుపులు అందుకున్నారు. అలాంటి వారి వల్లే బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో కనుమరుగయ్యారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాలలో బలహీనపడింది. ఇంత కాలానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అసలైన గాంధేయవాదాన్ని నమ్ముకుని ఆచరిస్తున్న మీనాక్షి నటరాజన్ ను తెలంగాణ ఇన్చార్జిగా నియమించింది. మీనాక్షి లాంటివారు ఒకరు ఉన్నారని.. అలాంటి వ్యక్తిని తెలంగాణకు ఇన్చార్జిగా నియమించారని.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బయటకు చెప్పలేదు. చిన్న నాయకులు కూడా రైలు ప్రయాణాన్ని మర్చిపోయిన ఈ రోజుల్లో మీనాక్షి ముందుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రైలులో ప్రయాణించి ఆశ్చర్యపరిచారు. ప్రభుత్వ అతిథి గృహంలో రోజుకు 50 రూపాయలు చెల్లించి బస చేస్తున్నారు. గత ఇన్చార్జి లు ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసేవారని” ఇలా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న కోణాన్ని రాధాకృష్ణ బయటపెట్టారు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోందని మొహమాటం లేకుండా చెప్పేశారు.
సాధ్యమవుతుందా
గ్రూపు కొట్లాటలకు.. గుంపు యుద్ధాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుందని మొదటి నుంచి తెలిసిందే. అందువల్లే ఆ పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. కేంద్రంలో అధికారానికి దాదాపు 11 సంవత్సరాలుగా దూరమైంది. ఇలాంటి క్రమంలో పార్టీ గాడిన పడాలంటే ఇలాంటి వ్యవహారాలు జరగకూడదు. అలాంటప్పుడు మీనాక్షి నటరాజన్ లాంటి వ్యక్తులను ఇన్చార్జిలుగా నియమించాలి. తెలంగాణలో పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి.. దీపా దాస్ మున్షి అడ్డగోలుగా వ్యవహరించారు కాబట్టి.. ఆలస్యంగా నైనా మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ విషయంలో కళ్ళు తెరిచింది. మరి కర్ణాటకలో ఏం చేస్తుందనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. అన్నట్టు తెలంగాణలో మీనాక్షి నటరాజన్ ఇప్పుడున్న పరిస్థితిని చక్కదిద్దుతారా? భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ లాంటి వారి శాఖలో ముఖ్యమంత్రిని వేలు పెట్టనిస్తారా? రేవంత్ రెడ్డి అలా వేలు పెడుతుంటే వారంతా చూస్తూ ఉంటారా? ఈ ప్రశ్నలకు రాధాకృష్ణ గనుక సమాధానం చెప్పగలిగితే.. ఈ వారం కొత్త పలుకు ఒక రేంజ్ లో ఉండేది. అన్నట్టు మీనాక్షి నటరాజన్ ను నియమించిన తర్వాత గులాబీ క్యాంపు ఒకసారిగా సైలెంట్ అయిపోయింది. అంటే దీపా దాస్ మున్షి కెసిఆర్ కు కనుసన్నల్లో ఏమైనా నడిచారా? ఏమో కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరుగుతుంది.. ఎలాగైనా జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ గుర్తు ఇన్చార్జిలకు ఎరుక కాబట్టి.
Also Read: జనసేన ప్లీనరీ కుదింపు.. సంచలన నిర్ణయం.. కారణాలు అవే!