Karimnagar Lok Sabha: కరీంనగర్‌ రివ్యూ : ఉద్యమ ఖిల్లాపై మళ్లీ కాషాయ జెండా!

దక్షిణాదిన పట్టు బిగించాలని చూస్తున్న బీజేపీ.. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లపై కన్నేసింది. ఈ క్రమంలో కరీంనగర్‌పై వరుసగా రెండోసారి గెలవాలని ప్రత్యేకంగా దృష్టిసారించింది.

Written By: Raj Shekar, Updated On : May 10, 2024 11:14 am

Karimnagar Lok Sabha

Follow us on

Karimnagar Lok Sabha: తెలంగాణ ఉద్యమంలో ముందు ఉండి గర్జించిన జిల్లా కరీంనగర్‌. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును గుండెకు హత్తుకున్న నియోజకవర్గం ఇది. కాంగ్రెస్‌ పార్టీకి అత్యధికంగా ఏడుసార్లు, బీఆర్‌ఎస్‌కు నాలుగుసార్లు, బీజేపీకి మూడుసార్లు విజయాలు అందించిన వెలమల కోట. గడిచిన మూడు ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కొక్కరిని గెలిపిస్తోంది.

టఫ్‌ ఫైట్‌..
కరీంనగర్‌లో ఈసారి టఫ్‌ఫైట్‌ ఖాయమంటున్నారు నిపుణులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు రాకపోయినా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గతేడాది విజయం సాధించింది. ఈసారి కూడా అదే రిపీట్‌ అవుతుందని భావిస్తున్నారు. ఇక గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఇక పూర్వవైభవం కోసం కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగు కాంగ్రెస్‌ ఖాతాలోనే ఉన్నాయి. అయినా గెలుపుపై ధీమా కనిపించడం లేదు.

త్రిముఖ పోరు..
సిటింగ్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ బీజేపీ నుంచి మరోసారి పోటీలో ఉండగా.. గతంలో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్‌రావు ఈసారి కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్నారు. గత మూడు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి వినోద్‌కుమార్‌ పోటీ చేశారు. ఒకసారి విజయం సాధించారు. మళ్లీ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

గెలిస్తే.. కేంద్ర మంత్రి పదవి!
దక్షిణాదిన పట్టు బిగించాలని చూస్తున్న బీజేపీ.. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లపై కన్నేసింది. ఈ క్రమంలో కరీంనగర్‌పై వరుసగా రెండోసారి గెలవాలని ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఈసారి బండి సంజయ్‌ గెలిస్తే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నందున కేంద్ర మంత్రి పదవి ఖాయమని బండి సంజయ్‌ కూడా భావిస్తున్నారు. ఈ మేరకు తన అనుచరులతో ప్రచారం కూడా చేయిస్తున్నారు. మోదీ గ్యారంటీలతో ఇప్పటికే ఏడు నియోజకవర్గాల్లో రెండుసార్లు ప్రచారం పూర్తి చేశారు. తాను ఎంపీగా కేంద్రం నుంచి మంజూరు చేయించిన నిధులు, అములు చేస్తున్న పథకాలపై బుక్‌లెట్లు ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేశారు. గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ప్రధాని మోదీని ఏకంగా వేములవాడకు తీసుకువచ్చి సభ నిర్వహించి క్యాడర్‌లో జోష్‌ నింపారు.

‘వెలిచాల’ సొంత విజన్‌..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలతోపాటు ‘కోహినూర్‌ కరీంనగర్‌’ పేరిట రాజేందర్‌రావు ‘వెలిచాల విజన్‌’ పేరుతో 23 సొంత గ్యారెంటీలను విడుదల చేశారు. సమస్యల పరిష్కారానికి ‘కరీంనగర్‌ సహాయక్‌ యాప్‌’, విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ, మెగా జాబ్‌ మేళాలు, ఉచిత ఆరోగ్య పరీక్షలు, సామూహిక వివాహాలు, ఉచిత డ్రైవింగ్‌ స్కూల్స్‌ వంటి 23 గ్యారెంటీలు ప్రకటించారు. ఉచితంగా జేపీబీలు, ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, డ్రోన్లు, ట్యాంకర్, రోడ్డు రోలర్‌ ప్రతీ నియోజకవర్గానికి ఇస్తానని ప్రకటించారు. చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారైనా.. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునే రీతిలో అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రముఖ ప్రజా ప్రతినిధిగా గుర్తింపు పొందిన జగపతిరావు కుమారుడే రాజేందర్‌రావు. జగపతిరావు 1972లో జగిత్యాల, 1989లో కరీంనగర్‌ నుంచి గెలిచి అనేక సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారు. తన తండ్రి జగపతిరావుకు ఉన్న మంచిపేరు, పార్టీ బలం, సొంత గ్యారెంటీలో తనను గెలిపిస్తాయన్న ధీమాతో రాజందేర్‌రావు ఉన్నారు.

చమటోడుస్తున్న బీఆర్‌ఎస్‌..
ఇక తెలంగాణలో బీఆర్‌ఎస్‌ గెలుపు ఆశలు పెట్టుకున్న రెండు స్థానాల్లో కరీంనగర్‌ ఒకటి. ఇక్కడి నుంచి గతంలో నాలుగుసార్లు బీఆర్‌ఎస్‌ గెలిచింది. కరీనంగర్‌ పార్లమెంటు పరిధిలోని హుజూరాబాద్, కరీంనగర్, సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. ఇది తమకు అనుకూలిస్తుందని, స్మార్ట్‌ సిటీ తీసుకువచ్చిన నేతగా వినోద్‌కుమార్‌ గెలుపు అవకాశాలను మెరుగు పరుస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో వినోద్‌ గెలుపు కోసం కేటీఆర్, కేసీఆర్‌ కూడా ప్రచారం నిర్వహించారు. అయితే బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పుట్టి ముంచుతుందేమో అన్న టెన్షన్‌ గులాబీ నేతల్లో కనిపిస్తోంది.