Congress 6 Guarantees: కెసిఆర్ చెప్పినట్టే నెత్తి, కత్తి లేదు. కాంగ్రెస్ ఉచితాలకు బాహుబలి బడ్జెట్ కావాలి!

నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల చొప్పున భృతి ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. అయితే నిరుద్యోగులను పరిగణనలోకి తీసుకునే ప్రమాణాలు ఇప్పటివరకు రాష్ట్రంలో ఖరారు కాలేదు.

Written By: K.R, Updated On : October 18, 2023 10:10 am

Congress 6 Guarantees

Follow us on

Congress 6 Guarantees: తెలంగాణ ఇచ్చింది. అయినప్పటికీ గత దశాబ్ద కాలం నుంచి అధికారానికి దూరంగానే ఉంటున్నది. దీనికి తోడు కేంద్రంలో కూడా అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ తీవ్ర ఉక్క పోతకు గురవుతోంది. ప్రస్తుత అధికార భారత రాష్ట్ర సమితి మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఈ క్రమంలోనే తనకు గతంలో అచ్చి వచ్చిన సంక్షేమ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది.. ఆరు గ్యారెంటీ ల పేరుతో ఏకంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మలిఖార్జున ఖర్గే చేతుల మీదుగా పథకాలను ప్రకటించింది. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీల విలువ ఎంత తెలుసా.. అక్షరాల 68,652 కోట్లు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇబ్బంది పడుతున్నది. మరి రేపు అధికారంలోకి వస్తే హామీలు ఎలా అమలు చేస్తుంది అని ఆర్థికవేత్తలు సందేహం వెలిబుచ్చుతున్నారు. కేసీఆర్ చెప్పినట్టే నెత్తి, కత్తి లేదు అని గుర్తు చేస్తున్నారు.

కాంగ్రెస్ హామీలు ఇలా..

రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ

రూ.లక్ష లోపు పంట రుణాల మాఫీకి అర్హులైన రైతులు 36.68 లక్షల మంది ఉన్నారు. రూ.లక్ష లోపు రుణాలను మాపీ చేస్తే రూ.19,191 కోట్లు వ్యయం అయ్యాయి. అదే రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తే.. రూ.38,398 కోట్లు కావాలి. ఈ హామీని అమలు చేయాలంటే అదనంగా రూ.19,191 కోట్లు భరించాల్సి వస్తుంది.

200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు

ప్రతి కుటుంబానికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. 200 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించుకునే కుటుంబాలు రాష్ట్రంలో 60-70 లక్షల వరకు ఉంటాయి. వీరికి ఉచిత విద్యుత్తు అందిస్తే ఏడాదికి రూ.2,500 కోట్ల భారం పడుతుంది.

రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి

నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల చొప్పున భృతి ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. అయితే నిరుద్యోగులను పరిగణనలోకి తీసుకునే ప్రమాణాలు ఇప్పటివరకు రాష్ట్రంలో ఖరారు కాలేదు. డిగ్రీ అర్హతతో 10 లక్షల మంది నిరుద్యోగులను పరిగణనలోకి తీసుకున్నా.. నెలకు రూ.400 కోట్లు కావాలి. ఏడాదికి రూ.4,800 కోట్లు అవసరం.

రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌

రాష్ట్రంలో నెలకు 52 లక్షల సిలిండర్లు వినియోగమవుతున్నాయి. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.955 ఉండగా… కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఒక్కోదానికి రూ.455 చొప్పున సబ్సిడీని చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ వ్యయం నెలకు రూ.236.60 కోట్లు, ఏడాదికి రూ.3,199.20 కోట్లు అవసరం.

రైతు భరోసా కింద రూ.15 వేలు

రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేల చొప్పున చెల్లిస్తామని కాంగ్రెస్‌ చెప్పింది. రాష్ట్రంలోని కోటిన్నర ఎకరాలకు ఏడాదికి రూ.22,500 కోట్లు కావాలి. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.10 వేల ప్రకారం ఏడాదికి రూ.15 వేల కోట్లు అవుతున్నాయి. వీటిని మినహాయిస్తే కాంగ్రెస్‌ భరించాల్సిన అదనపు భారం రూ.7,500 కోట్లు. కాగా, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున భృతిని చెల్లిస్తామని చెప్పింది. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద జాబ్‌ కార్డ్‌ హోల్డర్లు 52.92 లక్షల మంది ఉన్నారు. అయితే వీరిలో మూడింట రెండొంతుల మంది ప్రస్తుతం రైతుబంధు పొందుతున్నారు. మిగిలిన దాదాపు 18 లక్షల మందికి రూ.12 వేల చొప్పున సుమారు రూ.2,160 కోట్లు కావాలి. అంటే రైతు భరోసా కింద మొత్తం అదనపు భారం దాదాపు రూ.9,660 కోట్ల పడుతుంది.

ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు

సొంత జాగా ఉన్నవారి ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్‌ అంటోంది. రూ.3లక్షలు చెల్లిస్తామన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా 15.05 లక్షలు వచ్చాయి. ఇందులో 4.6 లక్షల దరఖాస్తులను తిరస్కరించి, 10.05 లక్షలు అర్హత కలిగినవిగా తేల్చారు. వీరికి రూ.5లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తే రూ.50,250 కోట్లు అవసరం. బీఆర్‌ఎస్‌ ప్రకటించిన రూ.3లక్షల ప్రకారం రూ.30,150 కోట్లు అవుతాయి. దీనిని మినహాయిస్తే అదనపుభారం రూ.20,100 కోట్లు.

ఇక ఆసరా పెన్షన్‌దారులకు నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. ప్రస్తుతం అన్ని రకాల పెన్షన్‌దారులు రాష్ట్రంలో 44 లక్షల మంది ఉన్నారు. వీరికి రూ.4 వేల చొప్పున చెల్లిస్తే ఏడాదికి రూ.21,120 కోట్లు అవసరం. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్ల స్కీమ్‌తో ఏడాదికి రూ.11,918 కోట్లు వ్యయమవుతున్నాయి. దీనిని మినహాయిస్తే పడే అదనపు భారం రూ.9,202 కోట్లు.

కేంద్రం హెచ్చరిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు

ఉచిత పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ‘ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)’ వంటి పథకాలను అమలు చేయవద్దని, వీటి కోసం అప్పులు చేసి చేతులు కాల్చుకోవద్దని చెబుతోంది. ఆర్‌బీఐ ద్వారా తీసుకునే రుణాలను మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలని సూచిస్తోంది. అయినా.. ఈ హెచ్చరికలను రాజకీయ పార్టీలు ఖాతరు చేయడం లేదు. ఉచిత నగదు పంపిణీ హామీలను పెద్ద ఎత్తున గుప్పిస్తున్నాయి. రైతుబంధు, రైతు భరోసా, ఉచిత విద్యుత్తు, నిరుద్యోగ భృతి, పంట రుణాల మాఫీ, సొంత జాగా ఉన్నవారికి ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్లు, చేయూత, గృహలక్ష్మి, గృహజ్యోతి.. ఇలా పథకం పేరు ఏదైనా దాదాపు అన్నీ నగదు బదిలీ, ఉచిత పథకాలే. ఇవి రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద గుదిబండలయ్యే ప్రమాదమున్నా పట్టించుకోవడంలేదు. అదే పనిగా హామీలిస్తూ ఓట్ల రాజకీయం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక వీటిని అమలు చేసే సందర్భంలో విషయం బోధపడుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రాష్ట్ర బడ్జెట్ బాహుబలిని మించిపోవాలి. ఇప్పటికే ఎక్సైజ్, సినరేజీ, రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెరిగాయి. ప్రభుత్వానికి వీటిలో పెంచుకునే వెసలు బాటు కూడా లేదు. అలాంటప్పుడు కొత్త రాబడి ఎలా వస్తుంది? అనేది ప్రశ్నగా మిగులుతోందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఒకవేళ ఇష్టానుసారంగా భూములు అమ్మితే భవిష్యత్తు పరిస్థితి ఏమిటి అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.