Defecting MLAs: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు సుప్రీం కోర్టు విధించిన గడువు సమీపిస్తోంది. దీంతో స్పీకర్ గడ్డం పసాద్‌కుమార్ వేగంగా ప్రక్రియ చేపడుతున్నారు. తాజా చర్యలు అనూహ్యమైన మలుపును తీసుకొచ్చాయి. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలపై డిఫెక్షన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ జారీ చేసిన అదనపు నోటీసులు విచారణ ప్రక్రియను వేగవంతం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీశాయి.
సుప్రీంకోర్టు జోక్యంతో చర్యలు
2024లో బీఆర్‌ఎస్‌లోని పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో ఫిరాయింపు వివాదం మొదలైంది. ఎమ్మెల్యేలు – పోచారం శ్రీనివాస్ రెడ్డి (బంస్వాడ), కల్యా యాదయ్య (చేవెల్ల), ఎం. సంజయ్ కుమార్ (జగిత్యాల), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), గుడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), టి. ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), అరికేపుడి గాంధీ (సేరిలింగంపల్లి), దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘాన్‌పూర్), తెల్లం వెంకట రావు (భద్రాచలం) – బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచినా పార్టీ మారారు. బీఆర్‌ఎస్ నేతలు ఈ మార్పును ఫిరాయింపుగా భావించి చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఎటూ తేల్చకపోవడంతో గులాబీ నేతలు హైకోర్టు తర్వాత సుప్రీ కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు జూలై 31, 2025 నాటి తీర్పులో స్పీకర్‌కు మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడంతో ప్రక్రియ వేగపడింది. ఫిబ్రవరి 2025లో మొదటి నోటీసులు జారీ అయినప్పటికీ, ఎమ్మెల్యేలు తమకు బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని, పార్టీ మారలేదని సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలు బీఆర్‌ఎస్ నేతలకు పంపబడిన తర్వాత, ఆ పార్టీ తరఫున జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్ వంటి నేతలు రీజాయిండర్లు సమర్పించారు.
స్పీకర్ తాజా ట్విస్ట్..
ఆగస్టు 2025 చివరిలో స్పీకర్ అదనపు నోటీసులు జారీ చేసి, మరిన్ని ఆధారాలు సమర్పించమని ఆరుగురు ఎమ్మెల్యేలు – సంజయ్, పోచారం, కలె యాదయ్య, తెల్లం వెంకట రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిని ఆదేశించారు. ఈ నోటీసులు డిఫెక్షన్ చట్టం (10వ షెడ్యూల్) ప్రకారం విచారణను లోతుగా చేయడానికి ఉద్దేశించబడ్డాయి. స్పీకర్ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవేత్తల సలహాలతో ఈ చర్య తీసుకున్నారు, ఎందుకంటే మొదటి సమాధానాలు బీఆర్‌ఎస్ ఫిర్యాదులకు సంతృప్తి చెయ్యలేదు. ఈ అనూహ్య చర్య రెండు కారణాల వల్ల ఆసక్తికరంగా మారింది. ఒకటి, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఫొటోలు, విజ్ఞప్తులు వంటి ఆధారాలు. ఇవి బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాము అనే వాదనను బలహీనపరుస్తున్నాయి. రెండు, స్పీకర్ ఈ విషయాన్ని సీల్డ్ కవర్‌లో పంపడం వల్ల విచారణ గోప్యతను కాపాడుతూ, రాజకీయ ఒత్తిడిని తగ్గిస్తోంది. బీఆర్‌ఎస్ నేతలు ఈ ఎమ్మెల్యేలను ‘ప్రజల మండేట్‌ను ద్రోహం చేసినవారు‘గా విమర్శిస్తున్నారు. ఉప ఎన్నికలకు డమాండ్ చేస్తున్నారు.
మొత్తంగా ఈ పరిణామం కాంగ్రెస్‌కు సవాలుగా మారింది, ఎందుకంటే పది సీట్లు కోల్పోతే అసెంబ్లీ మెజారిటీకి ప్రభావితమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని ‘సాధారణ ప్రక్రియ‘గా వర్ణించినప్పటికీ, ఎమ్మెల్యేలు న్యాయ సలహాలతో సమాధానాలు ఇవ్వాలని చెప్పారు. బీఆర్‌ఎస్ వర్గాలు ఇది ‘అనైతిక రాజకీయాలకు‘ బహిరంగత్వం అని వాదిస్తూ, ఈ కేసు తమ పార్టీకి మార్గదర్శకంగా మారుతుందని ఆశిస్తున్నాయి.